నిజం ధైర్యాన్నిస్తుంది. లేనిపోని భయాలను తుంచుతుంది. మనో నిబ్బరాన్ని పెంచుతుంది. రొమ్ముక్యాన్సర్ విషయంలో ఇప్పుడిలాంటి భరోసానే కావాలి. అపోహలను తొలగించుకొని, వాస్తవాలను తెలుసుకోవటమే కావాలి. అప్పుడే పూర్తిస్థాయి విజయం సాధ్యం.
అవగాహన లేకపోవటం :
ఒకప్పుడు మనదగ్గర గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల సంఖ్యే ఎక్కువ. ఇప్పుడు రొమ్ముక్యాన్సర్ దాన్ని అధిగమించేసింది. ఏటా 1.62 లక్షలకు పైగా మంది దీని బారినపడుతున్నారు. వీరిలో ప్రతి ఇద్దరిలో ఒకరు మృత్యువాత పడుతున్నారు కూడా. ఏటా 87వేల మంది మహిళలు రొమ్ముక్యాన్సర్ మూలంగా చనిపోతున్నారు. మనదగ్గర 60% మందిలో తీవ్ర దశలోనే సమస్య బయటపడుతుండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కొరవడటం. తొలిదశలో గుర్తించలేకపోవటం, చికిత్స ఆలస్యం కావటం. అపోహలు తొలగించుకొని, వాస్తవాలను తెలుసుకుంటే ఇలాంటి పరిస్థితిని చాలావరకు మార్చుకోవచ్చు.
మా కుటుంబంలో ఎవరికీ లేదు, నాకెందుకొస్తుంది?
* ఇది పూర్తిగా అపోహ. రొమ్ముక్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చాలామంది భావిస్తుంటారు. ఇందులో నిజం లేదు. రక్త సంబంధికుల్లో రొమ్ముక్యాన్సర్ లేకపోయినా ఎంతోమంది దీని బారినపడుతుండటం చూస్తున్నదే. కేవలం 5-10% మందిలోనే కుటుంబ చరిత్ర కనిపిస్తోంది. అంటే జన్యువుల కన్నా కూడా పరిసరాలు, జీవనశైలి వంటివే కీలక పాత్ర పోషిస్తున్నాయన్నమాట.
రొమ్ముల్లో గడ్డలన్నీ క్యాన్సర్లేనా?
* ఇది నిజం కాదు. రొమ్ముల్లో ఏర్పడే 10 గడ్డల్లో 9 మామూలువే. అలాగని నిర్లక్ష్యం తగదు. కొత్తగా ఎలాంటి గడ్డలను గుర్తించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. క్యాన్సర్ అవునో కాదో నిర్ధారించుకోవాలి. చేత్తో తాకి గడ్డల స్థితిని పరిశీలించటం, రెండు రొమ్ముల మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్షలు చేస్తారు. అల్ట్రాసౌండ్ సాయంతో సూది ద్వారా గడ్డ నుంచి చిన్న ముక్క తీసి (కోర్ నీడిల్ బయాప్సీ) పరీక్షిస్తారు. ఇలా మూడు విధాలుగా పరీక్షించి క్యాన్సర్ గడ్డనా? మామూలుదా? అన్నది నిర్ధారిస్తారు.
ఎవరికి వస్తుందో గుర్తించొచ్చా?
* ‘నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు వచ్చింది? అని చాలామంది మథన పడుతుంటారు. ఇందులో ఎవరి తప్పూ లేదు. క్యాన్సర్ ఎవరికి, ఎందుకు వస్తుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ కొన్ని అంశాలు దీని ముప్పు పెరిగేలా చేస్తాయి. దీనికి ప్రధాన ముప్పు కారకాలు- మహిళలు కావటం, వయసు మీద పడుతుండటం. సన్నిహిత కుటుంబసభ్యుల్లో ఎవరైనా రొమ్ముక్యాన్సర్ బారినపడటం, 12 ఏళ్లకు ముందే రజస్వల కావటం, 55 ఏళ్ల తర్వాతా నెలసరి కొనసాగటం, 30 ఏళ్ల వయసు తర్వాత తొలి సంతానం కనటం, దీర్ఘకాలంగా హార్మోన్ల భర్తీ చికిత్స తీసుకోవటం, ఊబకాయం.. ముఖ్యంగా నెలసరి నిలిచిన తర్వాత బాగా బరువు పెరగటం వంటివాటితోనూ ముప్పు పెరుగుతుంది. ఈస్ట్రోజెన్ ప్రభావం రొమ్ముల మీద దీర్ఘకాలం కొనసాగేలా చేసేవన్నీ క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేసేవే.
పెద్ద వయసు మహిళలకే వస్తుందా?
* రొమ్ముక్యాన్సర్ వయసు మీద పడ్డవారికే వస్తుందని అనుకోవటం పొరపాటు. ఇది చాలావరకు 50 ఏళ్లు పైబడ్డవారిలో కనిపించే మాట నిజమే అయినా చిన్నవయసులో రాకూడదనేమీ లేదు. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మనదేశంలో ఎంతోమంది చిన్నవయసులోనే రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారని గుర్తించాలి. మనదగ్గర 40-60 ఏళ్ల వయసు మహిళల్లోనే ఎక్కువగా రొమ్ముక్యాన్సర్ బయటపడుతోంది. ఇటీవలి కాలంలో చిన్నవయసులో రొమ్ముక్యాన్సర్లు మరింత ఎక్కువ సంఖ్యలో బయటపడుతుండటం ఆందోళనకరం.
బరువు అదుపులో ఉంచుకుంటే, వ్యాయామం చేస్తే భయపడాల్సిన పనిలేదా?
* అధిక బరువును తగ్గించుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం వంటివి క్యాన్సర్ ముప్పు తగ్గేలా చేయటం నిజమే. అంతమాత్రాన వీటితో అసలే క్యాన్సర్ రాదనుకోవటానికి లేదు. ముప్పు కారకాలను అదుపులో ఉంచుకోవటం అవసరం. మహిళలంతా అవగాహన పెంచుకొని, రొమ్ముల్లో కొత్తగా తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. నొప్పిలేని గడ్డలు.. రొమ్ముల ఆకారం, సైజు మారటం.. చనుమొనలు లోపలికి లాక్కొనిపోవటం.. మొనల నుంచి రక్తం రావటం.. మొనల మీద లేదా చుట్టూరా ఎర్రటి దద్దు.. రొమ్ముల మీద ఎక్కడైనా సొట్ట పడటం.. చంకల్లో గడ్డల్లాంటివి కనిపించటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయరాదు. అలాగే 40 ఏళ్లు దాటాక ఏటా లేదంటే కనీసం రెండేళ్లకు ఒకసారైనా ముందస్తు (స్క్రీనింగ్) మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటమూ ముఖ్యమే. క్యాన్సర్ ఆనవాళ్లేవైనా ఉంటే ఇందులో బయటపడతాయి. ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయటం తేలిక.
ముప్పును అంచనా వేయటానికి జన్యు పరీక్ష చేయించుకోవాలా?
* చాలామందికి అవసరం లేదు. ఇది అనవసర భయాలకు తావిచ్చే అవకాశముంది. రక్త సంబంధికుల్లో ఎవరైనా 40 ఏళ్ల లోపు రొమ్ముక్యాన్సర్ బారినపడటం, ఏ వయసులోనైనా రక్త సంబంధికుల్లో ఇద్దరు లేదా అంత కన్నా ఎక్కుమంది రొమ్ముక్యాన్సర్ బారినపడటం, రక్త సంబంధికుల్లో ఎవరికైనా రెండు రొమ్ముల్లో క్యాన్సర్ రావటం లేదా రొమ్ము, అండాశయ క్యాన్సర్ రెండూ వచ్చి ఉండటం.. రక్త సంబంధికుల్లో ఎవరైనా మగవారు రొమ్ము క్యాన్సర్ బారిన పడి ఉండటం.. ఇలా కుటుంబపరంగా క్యాన్సర్ ముప్పు బలంగా ఉన్నవారికే జన్యుపరీక్ష చేయటం మంచిది. అదీ జన్యువుల గురించి పూర్తిగా వివరించాకే చేయాలి. ఈ పరీక్ష చాలా ఖరీదైంది.
మగవారికీ వస్తుందా?
* రొమ్ముక్యాన్సర్ ఆడవారిలో ఎక్కువగా కనిపించినా మగవారికి రాకూడదనేమీ లేదు. కాకపోతే అరుదు. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో మగవారు కేవలం ఒక్క శాతమే.
ముప్పు అధికంగా గలవారు ముందే రొమ్ములు తీయించుకోవటమే మంచిదా?
* ముప్పు అధికంగా ఉన్నవారు నెలసరి నిలవటానికి ముందే రొమ్ములను, ఫలోపియన్ ట్యూబులు తొలగించుకుంటే రొమ్ము, అండాశయ క్యాన్సర్ ముప్పులు తగ్గుతున్నట్టు తేలినప్పటికీ ఇతర మార్గాలు లేకపోలేదు. సర్జరీ వద్దనుకునేవారిని జీవితాంతం ఏటా మామోగ్రామ్, ఎంఆర్‌ఐ స్కాన్ చేస్తూ నిశితంగా పరిశీలించటం ముఖ్యం. రొమ్ముక్యాన్సర్ చికిత్సలో వాడే టమాగ్జిఫెన్ మందు ఐదేళ్ల వరకు ఇవ్వటమూ మేలు చేస్తుంది.
గర్భనిరోధక మాత్రలతో వస్తుందా?
* ప్రస్తుతం అందుబాటులో ఉన్న గర్భనిరోధక మాత్రల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తక్కువ మోతాదుల్లోనే ఉంటున్నాయి. అందువల్ల వీటితో క్యాన్సర్ ముప్పేమీ పెరగదు.
మొత్తం రొమ్ము తీయాల్సిందేనా?
* రొమ్ముక్యాన్సర్ తలెత్తినా అందరికీ మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం లేదు. కణితి తీరును బట్టి కొందరికి గడ్డ, దాని చుట్టూరా కొంత కణజాలాన్ని మాత్రమే తీసి, మిగతా భాగాన్ని అలాగే ఉంచొచ్చు. అదే సమయంలో సొట్ట కనిపించకుండా ఆంకోప్లాస్టిక్ ప్రక్రియ ద్వారా ఆకృతిని సరిచేయొచ్చు. సర్జరీ తర్వాత రేడియోథెరపీ తప్పనిసరి. గడ్డ భాగాన్నే తొలగించినా దీర్ఘకాలంలో మంచి ఫలితమే ఉంటుంది.
-డా.పి.రఘురాం
డైరెక్టర్ కిమ్స్ -ఉషాలక్ష్మి
సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్
హైదరాబాద్.