మాదాపూర్‌కు చెందిన 40 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వారం రోజుల కిందట కంటి చూపు మందగించడంతో బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. అక్కడ పేరొందిన ఈఎన్‌టీ వైద్యుడు అతన్ని పరిశీలిస్తే బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు గుర్తించారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే నెలన్నర రోజుల కిందట అతనికి కరోనా సోకి జ్వరం రావడంతో ఇంట్లోనే ఉండి సొంతంగా 23 రోజులపాటు స్టిరాయిడ్ మందులు వాడినట్లు తెలిసింది. అత్యధిక మోతాదులో వాడి.. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఫంగస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.
మోతాదుకు మించి
కరోనా బారినపడిన అనేకమంది ఇంట్లో ఐసొలేషన్‌లో ఉండి వైద్యుల పర్యవేక్షణ లేకుండానే ఇష్టానుసారం స్టిరాయిడ్లు వాడటంతో చేతులారా బ్లాక్ ఫంగస్‌ను తెచ్చుకుంటున్నారని వైద్యుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. చాలా మంది వాట్సాప్‌లో తిరిగే కొన్ని రకాల మందులను కరోనాను జయించడం కోసం వాడేశారు. ఇలాంటి వారిలో స్టిరాయిడ్లు ఓవర్ డోస్‌గా మారి చాలామందిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయి సులభంగానే బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. ఈ ఫంగస్ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే మొత్తం రోగుల్లో 20 నుంచి 25 శాతం వరకు ఇటువంటి రోగులేనని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్రమాదకర ధోరణి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా..
బ్లాక్ ఫంగస్ మూడు రకాల కారణాలతో వస్తోందని వైద్యులు చెబుతున్నారు. స్టిరాయిడ్లు అతిగా వాడకం, మధుమేహం నియంత్రణలో ఉండకపోవడం, కరోనా వచ్చి తగ్గిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం. కరోనా సోకి హోం ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు సొంతంగా స్టిరాయిడ్లు వాడకూడదని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి 93 శాతానికంటే దిగువకు పడినపుడు, జర్వం కొన్ని రోజులపాటు తగ్గకుండా వస్తున్నప్పుడు ఆస్పత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్టిరాయిడ్లు వాడకూడదని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నా.. ఇంట్లో ఐసొలేషన్‌లోనే ఉంటూ వైద్యులను సంప్రదించడం లేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వచ్చే సందేశాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని మందులు వాడేస్తున్నారు.
సాధారణంగా స్టిరాయిడ్లు వాడినపుడు మధుమేహం ఒక్కసారిగా పెరిగిపోతుంది. పెరిటిన్ తదితరమైనవి కూడా ఒక్కోసారి అదుపుతప్పుతుంటాయి. అదే వైద్యుల పర్యవేక్షణలో ఉంటే వీటికి మందులు వాడుతూ స్టిరాయిడ్స్ కోర్సును అందజేస్తారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వేలాది మంది మూడు నాలుగు రోజులు జర్వం వస్తే తమంత తాముగా స్టిరాయిడ్లు వాడకం మొదలుపెడుతున్నారు. దాదాపు రెండు మూడు వారాలు ఈ మందులను అధిక మోతాదులో వాడేస్తున్నారని వైద్యుల పరిశీలనలో తేలింది. దీంతో మధుమేహం పెరిగి ఇతరత్రా అవయవాలు సరిగా పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో చాలామంది బ్లాక్ ఫంగస్ వ్యాధి బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. బంజరాహిల్స్‌కు చెందిన ప్రైవేటు ఆస్పత్రిలో ఒక వైద్యుడు గత మూడు వారాల్లో బ్లాక్ ఫంగస్‌కు సంబంధించి 75 మందికి ఆపరేషన్లు చేస్తే అందులో 20 మంది సొంతంగా స్టిరాయిడ్లు వాడటం వల్లే వ్యాధి బారినపడ్డారని తేలింది. గాంధీ, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఫంగస్ బాధితుల్లో కూడా ఇలాంటి వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు.
కోలుకున్న నెలరోజుల లోపే బ్లాక్ ఫంగస్
కరోనా సోకిన రోగులు ఇస్టానుసారంగా స్టిరాయిడ్లు వాడకూడదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు 93 శాతాని కంటే తగ్గినప్పుడు సంబంధిత రోగులు ఆస్పత్రిలో చేరాలి. అప్పుడు వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన తరువాతే స్టిరాయిడ్స్ కోర్సు మొదలుపెడతారు. కరోనాను జయించిన నెలరోజుల్లోపు అధిక భాగం బ్లాక్‌ఫంగస్ బారినపడుతున్నారు. ఆ నెలరోజులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ ఎన్.విష్ణుస్వరూప్ రెడ్డి, ప్రముఖ ఈఎన్‌టీ, కేర్
ఆరోగ్య పరిస్థితిని బట్టి స్టిరాయిడ్లు వాడాలి
జ్వరం తగ్గలేదన్న కారణంగా స్టిరాయిడ్లు కోర్సు మొదలు పెట్టకూడదు. సంబంధిత కరోనా రోగి ఆరోగ్యాన్ని అంచనా వేసి అవసరమైన మేరకు వైద్యుల పర్యవేక్షణలో ఇవ్వాలి. చాలామంది ఇంట్లోనే ఉండి స్టిరాయిడ్ హై డోసును తీసుకుంటున్నారు. దీనివల్ల కరోనా నుంచి కోలుకోవడం అటుంచి కొన్ని అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి.
- డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ పల్మనాలజిస్టు, ఏఐజీ
ఇంట్లో కూడా మాస్కు ధరిస్తే ఫలితం ఉంటుంది
కరోనా నుంచి కోలుకున్న వారు బ్లాక్‌ఫంగస్ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే కనీసం రెండు నెలలపాటు ఇంట్లో కూడా మాస్కు ధరించాలి. బయకు వెళ్లినపుడు ఎన్95 మాస్కు, ఇంట్లో సర్జికల్ లేదా ఇతర మాస్కు గానీ వాడాలి. స్టిరాయిడ్స్ వాడి మధుమేహంతో ఉన్న వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ముక్కులో బ్లాక్ ఫంగస్ చేరకుండా నిరోధించాలంటే కనీసం రెండు, మూడు నెలలపాటు బయట, ఇంట్లో కూడా మాస్కు ధరించడమే ఉత్తమం.
- డాక్టర్ ప్రగతి, వైరాలజిస్టు, మెడికోవర్
ఇదీ చదవండి: covid effect: ఉపాధి కరవై పట్టెడన్నం కోసం సినీకార్మికుల పాట్లు