ఉల్లితో కలిగే లాభాలు
- దీంట్లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే కొల్లాజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
- పచ్చి ఉల్లిపాయ చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- దీంట్లో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
- ఉల్లిరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే జలుబు, అలెర్జీలు తగ్గుతాయంటారు.
- ఉల్లిపాయలో ఉండే ఫోలేట్ నిద్రపట్టేలా, ఆకలి వేసేలా చేస్తుంది. కుంగుబాటు తగ్గడానికీ తోడ్పడుతుంది.
మసాలా కూర
కావాల్సినవి: ఉల్లిపాయలు- ఆరు, ధనియాల పొడి- టీస్పూన్, జీలకర్ర పొడి- టీస్పూన్, ఉప్పు- తగినంత, కారం- సరిపడా, నువ్వులు, పల్లీల పేస్ట్- కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్- టీస్పూన్, తరిగిన పచ్చిమిర్చి- మూడు, చింతపండు గుజ్జు- రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- టీస్పూన్, జీలకర్ర- టీస్పూన్, ఎండుమిర్చి- రెండు, పసుపు- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, కొత్తిమీర తురుము- కొద్దిగా, నూనె- మూడు టేబుల్ స్పూన్లు.
తయారీ: నువ్వులు, పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పసుపు, కారం, అల్లంవెల్లులి, కొంచెం ఉప్పు కలిపి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన నువ్వులు, పల్లీల మిశ్రమం, జీలకర్ర, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కొన్ని నీళ్లు పోసి అన్నీ కలిసేట్టుగా బాగా కలపాలి. తర్వాత ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్రపొడి వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి పదిహేను నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దించిన తర్వాత కొత్తిమీర తురుము వేసుకోవాలి. ఈ కూర అన్నం, చపాతీల్లోకి ఎంతో బాగుంటుంది.
ఉల్లిపొరక ఉక్కిరి
కావాల్సినవి: ఉల్లిపొరకలు- రెండు కట్టలు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర- అర టీస్పూన్, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఆరు, పసుపు- అర టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- టేబుల్ స్పూన్.
తయారీ: ఉల్లిపొరకలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్నముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర వేసి, అది చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకలు, ఉప్పు వేసి మూతపెట్టి పది నిమిషాలపాటు మగ్గనివ్వాలి. వీటిల్లోనే నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పని లేదు. నీరంతా ఇంకిపోయి కూర దగ్గరకు వచ్చిన తర్వాత దించి కొత్తిమీర తురుము వేయాలి. ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్ఛు ఈ వేపుడు అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
మినీ ఇరానీ సమోసా
కావాల్సినవి: మైదా- కప్పు, గోధుమపిండి- కప్పు, అటుకులు- కప్పు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, చిన్నముక్కలుగా కోసిన పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర- పావుకప్పు, కారం- అర టీస్పూన్, గరం మసాలా- పావు టీస్పూన్, చాట్‌మసాలా- పావు టీస్పూన్, వాము- పావు టీస్పూన్, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: గిన్నెలో మైదా, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నూనె, వాము వేసి బాగా కలపాలి. పిండిలో నూనె వేసుకుంటే సమోసాలు గుల్లగా వస్తాయి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరంమసాలా, చాట్‌మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను నాలుగు సమాన భాగాలుగా చేసుకుని పెద్ద చపాతీల్లా ఒత్తుకోవాలి. పైన మైదా పిండి చల్లుకుంటూ పలచగా ఒత్తుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత చపాతీ వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. చాకుతో చపాతీకి అటు, ఇటు ఉండే చివర్లను కత్తిరించి చపాతీ చతురస్రాకారంలో ఉండేలా చేయాలి. ఇప్పుడు స్కేలు ఉపయోగించి దీన్ని మూడు సమాన భాగాలుగా కత్తిరించాలి. చిన్నగిన్నెలో కొద్దిగా మైదా వేసుకుని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. కత్తిరించిన చపాతీ ముక్కను త్రికోణాకారంలో మడత పెట్టి అంచుల దగ్గర మైదా పేస్టు రాయాలి. మధ్యలో ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి మడతపెట్టుకుని విడిపోకుండా మైదాతో అతికించాలి. ఇలా అన్ని సమోసాలను చేసుకున్న తర్వాత కడాయిలో నూనె పోసి వేడెక్కాక వేయించుకోవాలి. సమోసాలను రెండువైపులా తక్కువ మంట మీద వేయించాలి. మిగిలిన చపాతీ చివర్లను వృథాగా పారేయకుండా చిన్న ముక్కలుగా కోసుకుని వేయించుకోవచ్ఛు కాస్త కారంగా తినాలనుకుంటే.. పచ్చిమిర్చికి మధ్యలో గాటుపెట్టి నూనెలో వేయించాలి. వీటి మీద కాస్త ఉప్పు చల్లి సమోసాతో తింటే రుచి అదిరిపోతుంది.
పచ్చడి
కావాల్సినవి: చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- రెండు, ఎండుమిర్చి- ఇరవై, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, ధనియాలు- మూడు టీస్పూన్లు, మెంతులు- అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు- పది, ఆవాలు- అర టీస్పూన్, మినప్పప్పు- టీస్పూన్, పసుపు- పావు టీస్పూన్, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బ- ఒకటి, కొత్తిమీర- కొదిగా.
తయారీ: స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేయాలి. ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి. వీటిని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లోని నీరు బయటకు వచ్చి త్వరగా వేగుతాయి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును నీటితోపాటుగా వేసి ఉడకనివ్వాలి. వేయించిన ఎండుమిర్చిని మిక్సీ పట్టి పొడిచేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఉడికి మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఎండుమిర్చి పొడి వేయాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో నీళ్లు కలపకూడదు. చివరగా కడాయిలో నూనె పోసి వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేసి వేయించాలి. ఇందులో పచ్చడి వేసి రెండు, మూడు నిమిషాల పాటు ఉడికించాలి. నూనె కొంచెం ఎక్కువగా వేస్తే వారం రోజులపాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఒక్కరోజు కోసం చేసుకుంటే నూనె తక్కువగా వేసుకోవచ్ఛు ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోసెల్లోకి కూడా బాగుంటుంది.
పులుసు
కావాల్సినవి: చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- నాలుగు, చింతపండు- నిమ్మకాయంత, పొడవుగా కోసిన పచ్చిమిర్చి- మూడు, ధనియాల పొడి- టేబుల్‌స్పూన్, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా, పసుపు- పావు టీస్పూన్, మెంతులు- టీస్పూన్, కారం- టేబుల్‌స్పూన్, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- సరిపడా.
తయారీ: చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. దీంట్లో మెంతులు, చిదిమిన వెల్లుల్లి వేసి ఇవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. తర్వాత మంట తగ్గించి మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసి ఉల్లిపాయలను రంగు మారేంత వరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, చింతపండు పులుసు వేసి కలపాలి. పులుసు చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోయాలి. దీంట్లో ధనియాల పొడి వేసి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద పులుసును ఉడకనివ్వాలి. నూనె పక్కలకు వచ్చిందంటే ఉడికినట్టే. ఉల్లిపాయలను సన్నగా తరిగితే పులుసు చిక్కగా ఉంటుంది. చివరగా కొత్తిమీర తురుము వేసుకోవాలి.
చివరగా ఉల్లి గురించి...
- పచ్చి ఉల్లిపాయను నమలడం వల్ల నోటి దుర్వాసనను అరికట్టవచ్ఛు దంతక్షయాన్నీ నివారించవచ్ఛు.
- ఉల్లిపాయలోని నూనెలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి తోడ్పడతాయి.
ఇదీ చూడండి: తీరంవైపు కదులుతున్న 'నిసర్గ'-రాష్ట్రాలు అప్రమత్తం