ఎలా తయారుచేసుకోవాలి?
కావాల్సినవి
- నీళ్లు - 2 లీటర్లు
- కీరా దోస - 1 (మీడియం సైజు) (శుభ్రంగా కడిగి చిన్న చిన్న స్లైసుల్లా కట్ చేసుకోవాలి)
- నిమ్మకాయ – ఒకటి (చిన్న చిన్న స్లైసుల్లా కట్ చేసుకోవాలి)
- పుదీనా - కొద్దిగా
- ఐస్ ముక్కలు - కొన్ని
తయారీ
రెండు లీటర్ల నీళ్లు పట్టే పాత్రలో ముందుగా కీరా దోస స్లైసుల్ని వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు.. వేసి నీళ్లు నింపాలి. ఇప్పుడు దీన్ని తక్షణమే సర్వ్ చేసుకోవాలనుకునే వారు అందులో ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. తర్వాతైనా పర్లేదు అనుకునే వారు సర్వ్ చేసుకోవడానికి గంట ముందు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది.
బరువు తగ్గచ్చు!
అధిక బరువును తగ్గించుకునే క్రమంలో మనం తీసుకునే ఆహారంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. ఈ క్రమంలో కొంతమంది నచ్చినా నచ్చపోయినా బలవంతంగా నీళ్లు తాగుతుంటారు. అలాంటి వారు రోజులో కొన్ని సార్లు సాధారణ నీటికి బదులుగా కీరా దోస నీటిని తాగచ్చు. ఇందులో అసలు క్యాలరీలే ఉండవు.. పైగా ఈ నీటిని తాగడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి ఆకలేయదు. తద్వారా ఇతర పదార్థాల పైకి మనసు మళ్లకుండా జాగ్రత్తపడచ్చు. బరువును తగ్గించుకోవడానికి ఇదీ ఓ పద్ధతే అంటున్నారు నిపుణులు.
క్యాన్సర్ రాకుండా..!
ఫ్రీరాడికల్స్ శరీరంలోని కణాల్ని డ్యామేజ్ చేసినప్పుడు క్యాన్సర్, డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు, అల్జీమర్స్.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తుతాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే ఫ్రీరాడికల్స్‌ని చంపే యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందించాలి. ఇందుకోసం కీరా దోస నీళ్లు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. కీరాలో అధికంగా ఉండే విటమిన్ ‘సి’, బీటా కెరోటిన్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్.. వంటి పోషకాలు ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. తద్వారా జీవక్రియల పనితీరు మెరుగై ఆరోగ్యంగా ఉండచ్చు. అలాగే కీరాలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడి ఈ మహమ్మారి బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయని ఓ అధ్యయనంలో కూడా తేలింది.
బీపీని నియంత్రిస్తుంది!
మన శరీరంలో సోడియం స్థాయులు పెరిగినా, పొటాషియం తగ్గినా రక్తపోటు వస్తుంది. అయితే పొటాషియం తగినంత తీసుకోవడం వల్ల ఒకవేళ సోడియం ఎక్కువైనా దాన్ని అదుపు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా ఇటు బీపీ రాకుండా ఉండడంతో పాటు అటు అధిక సోడియం వల్ల కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడకుండా కూడా కాపాడుకోవచ్చు. అందుకు పొటాషియం ఎక్కువగా ఉండే కీరా చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో కీరా నీళ్లను తాగడం శ్రేయస్కరం!
రక్తం గడ్డకట్టేలా..!
మన శరీరంపై ఎక్కడైనా గాయమైతే అసలు రక్తం గడ్డ కట్టకపోయినా, మరీ ఎక్కువగా గడ్డ కట్టినా ప్రమాదమే! అయితే ఈ సమస్యను అదుపు చేసే శక్తి కీరా నీటికి ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కీరాలో ఉండే విటమిన్ ‘కె’ ఇందుకు తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఎముకలు-కణజాలాల ఆరోగ్యానికి, రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ప్రొటీన్లను రూపొందించడానికి శరీరానికి ఈ విటమిన్ చాలా అవసరం. అంతేకాదు.. ఒక కప్పు కీరా ముక్కల్లో మన శరీరానికి అవసరమైన రోజువారీ పొటాషియంలో సుమారు 19 శాతం దాకా పొందచ్చంటున్నారు నిపుణులు.
జిడ్డు చర్మమా?
వేసవిలో చర్మం జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు-మచ్చలు రావడం చాలామందిలో సహజమే! అలాగే ఈ కాలంలో ఎదురయ్యే డీహైడ్రేషన్ ప్రభావం చర్మం పైనా పడుతుంది. మరి, ఈ సమస్యల్ని ఎదుర్కొని చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే చక్కటి మార్గం కీరా నీళ్లు. కీరా దోసలో ఉండే పాంటోథెనిక్ ఆమ్లం/విటమిన్ - బి 5 మొటిమల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మెరిపించేలా చేస్తుంది.
ఇవి కూడా!
- ఒక గ్లాసు కీరా నీళ్లు నోట్లో లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా నోట్లో బ్యాక్టీరియా, ఇతర క్రిములు చేరకుండా నోరు ఎప్పటికప్పుడు శుభ్రమవుతుంది. ఫలితంగా నోటి దుర్వాసనకు దూరంగా ఉండచ్చు.
- కీరాలో ఉండే సిలికా అనే ఖనిజం కండరాల సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వర్కవుట్ చేసే వారు సాధారణ నీటికి బదులుగా కీరా నీటిని తీసుకోవడం వల్ల మరింత యాక్టివ్‌గా వ్యాయామం చేయచ్చు.
- జ్ఞాపకశక్తి తక్కువగా ఉండే వారు కీరా నీటిని తాగడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకు కీరాలో ఉండే Fisetin అనే ఫ్లేవనాల్ కారణమని నిపుణులు చెబుతున్నారు.
- శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించి.. జీవక్రియల పనితీరును మెరుగుపరిచే శక్తి కీరా నీటికి ఉంది.
కీరా నీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి, ఇప్పట్నుంచైనా నీళ్లంటే మొహం చిట్లించుకోకుండా.. ఈ టేస్టీ వాటర్‌ని మన డైట్‌లో చేర్చేసుకుందాం..! సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం..!