ప్రతి తల్లి, తండ్రి ఉల్లాసంగా ఆడుకునే ఆరోగ్యకరమైన సంతానాన్ని ఊహించుకుంటారు. కానీ ఎవరైనా చిన్న వయసులో అసాధారణంగా, మందబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటే వారి నానమ్మలు, అమ్మమ్మలు ఇటువంటి పిల్లలను మన వంశంలో ఎప్పుడూ చూడలేదు అని దిగులు పడుతుంటారు. ఇటువంటి పిల్లలనే ఆటిజం ఉన్న పిల్లలుగా గుర్తించవచ్చు. దీనిని ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ అని కూడా అంటారు.
ఇటువంటి మందబుద్ధి పిల్లల భావ వ్యక్తీకరణను దెబ్బతీస్తుంది. దృష్టి కేంద్రీకరించటంలోనూ, చిన్న చిన్న పనులు చేయటంలోనూ ఇబ్బంది పడుతూ ఆలోచనా సరళి, విషయ గ్రాహ్యతలో వెనుకబడి ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించే పిల్లల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. ఒకరిలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు మరొకరిలో తక్కువగా కనిపించవచ్చు. అందుకే ఈ జబ్బు పేరులో స్ప్రెక్ట్రం అనే పదాన్ని వాడారు. వీరిలో కొందరు గణితం, సాహిత్యం, చిత్ర కళ, సంగీతం మొదలైన రంగాల్లో అసాధారణ ప్రజ్ఞ చూపించినా, మరికొందరిలో సరైన అవకాశాన్ని సరైన సమయంలో కల్పిస్తే వారూ ఈ ప్రత్యేక నైపుణ్యాలను సాధించగలరు. అందుకు ఆటిజంను ముందుగానే గుర్తించటం తప్పనిసరి.
18 నెలల వయసులోనే ఆటిజం లక్షణాలు కొన్ని కనిపించవచ్చు. వీటిని క్లినికల్ సైకాలజిస్టులు కానీ, శిశు వైద్యులు కానీ గుర్తుపట్టగలరు. ముందుగానే వ్యాధి నిర్ధరణ చేసిన శిశువులను మాటలు నేర్పే చికిత్స కోసం, చిత్రాలను గుర్తించటం వాటి గురించి వివరించటం, ప్రవర్తనా రీతిని మార్చే చికిత్స కోసం పంపించాలి. ఆటిజం పిల్లలకు దృశ్యాలను గుర్తుంచుకునే అభినివేశం ఎక్కువగా ఉండటం వల్ల వీటి ద్వారా వీరికిచ్చే శిక్షణ మంచి ఫలితాలను కలుగచేస్తుంది.
ఆటిజం జీవితాంతం వెంటాడే సమస్య అయినందువల్ల సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే వారి జీవన గమనం సాఫీగా సాగుతుంది. సంపూర్ణంగా చికిత్సను అందించే వ్యాధి కాదిది. చాలా మంది ఆటిజం పిల్లల్లో భాషలో భావవ్యక్తీకరణ ఇబ్బందులున్నప్పటికీ వారిలో స్పష్టమైన ఆలోచన, సృజన ఉంటాయి. వారి కోసం ఆవాజ్ ఎఎసి లాంటి యాప్స్ తయారుచేశారు.
చిన్న వయసులో వ్యాధి నిర్ధరణ తరువాత వారి కౌశలాన్ని బట్టి ప్రత్యేక పరిశోధన ఫలితాలననుసరించి చికిత్సను అందిస్తూ వారి లోపాలను అధిగమించేలా సహాయం అందించాలి. ఆటిజం చికిత్సలు విశేషంగా లభిస్తుండటం వల్ల తల్లిదండ్రులు కూడా ఏ చికిత్స ఎప్పుడు తీసుకోవాలో స్పష్టత లేక గందరగోళంలో పడిపోతారు. అందువల్ల స్థానికంగా అనుభవం ఉన్న చిన్న పిల్లల వైద్యుని సంప్రదించి సరైన చికిత్సను, సూచనలను పాటించాలి.
తల్లిదండ్రులు, బిడ్డ, ఆటిజం చికిత్సకులు పారదర్శకంగా వారి ప్రణాళికను అమలు చేయాలి. నమ్మకం, గౌరవం, ఓపిక ఈ చికిత్సలో చాలా అవసరం.