ఒకవైపు రోజురోజుకీ ఎక్కువవుతున్న కొవిడ్-19 కేసులు. మరోవైపు పెరిగిపోతున్న మరణాలు. ఆసుపత్రుల్లో రద్దీ పెరగటం.. సదుపాయాలు, చికిత్సలు సత్వరం అందకపోవటం వంటి దృశ్యాలు భయానక పరిస్థితికే అద్దం పడుతున్నాయి. ఇంతటి భీతావహ వాతావరణంలోనూ టీకా ఒక్కటే ఆశాజనకంగా, తిరుగులేని బ్రహ్మాస్త్రంలా అభయమిస్తోంది. నిజానికి టీకా సైతం కొవిడ్-19 కారక సార్స్-కోవీ2 లాంటిదే. కాకపోతే ప్రమాదకరం కాదు. ఎలాంటి హాని చేయకుండానే మనలో రోగనిరోధకశక్తిని ఉత్తేజితం చేస్తుంది. యాంటీబాడీలు పుట్టుకొచ్చేలా చేసి మున్ముందు ఇన్‌ఫెక్షన్ బారినపడకుండా.. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ తలెత్తినా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా కాపాడుతుంది.
అయితే ఆరోగ్యవంతుల దగ్గర్నుంచి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, అలర్జీల వంటి దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారి వరకూ అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న. టీకా తీసుకోవాలా? వద్దా? తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పటికే మన దగ్గర దాదాపు 16 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. అయినా ఇంకా సందేహాలు ఎందుకు? ఏదైనా అనుమానం ఉంటే నివృత్తి చేసుకొని, ముందుకు సాగటమే తక్షణం చేయాల్సిన పని.