సమస్య పెద్దదే కావొచ్చు. కారణం మాత్రం చాలా చిన్నది. చికిత్స అంత కన్నా తేలికైంది. అతి చవకైందీనూ. అవును. థయమిన్ (విటమిన్ బి 1) లోపంతో చిన్నారుల్లో తలెత్తే గుండె జబ్బును (కార్డియాక్ బెరిబెరి) చిన్నపాటి జాగ్రత్తలతోనే పూర్తిగా నివారించుకోవచ్చు. ఒకవేళ తలెత్తినా సరిగ్గా గుర్తిస్తే మామూలు చికిత్సతోనే నయమవుతుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇతరత్రా జబ్బులుగా పొరపడి అనవసర చికిత్సలు చేస్తే ప్రాణాల మీదికీ రావొచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఎంతోమంది పిల్లలు కార్డియాక్ బెరిబెరి మూలంగా సతమవుతున్నారు. కొన్నేళ్లుగా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది కూడా. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన కలిగుండటం అత్యవసరం.
అవసరమయ్యేది తక్కువ మోతాదులోనే. అయితేనేం.. థయమిన్ చేసే పని అంతా ఇంతా కాదు. పిండి పదార్థం, కొవ్వు, ప్రొటీన్ జీవక్రియలతో ముడిపడిన సిట్రిక్ యాసిడ్ (క్రెబ్స్) చట్రంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా మనం తీసుకునే పిండి పదార్థాలు గ్లూకోజుగా మారటం, దీన్నుంచి కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవటంలో ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే- థయమిన్ తగినంత లేకపోతే కణాలు చతికిల పడిపోతాయి. కణాలు వృద్ధి చెందటం, మరమ్మతు కావటం దెబ్బతినిపోతుంది.
అసలు థయమిన్ ఎలా పనిచేస్తుంది?
థయమిన్ నీటిలో కరిగే విటమిన్. ఇది ఒంట్లో ఎక్కువగా నిల్వ ఉండదు. ఆహారం ద్వారా రోజూ భర్తీ చేసుకుంటే తప్ప పూర్తి స్థాయిలో పనిచేయదు. థయమిన్ మన ఒంట్లో చాలావరకు ఎముకలకు అంటుకొనే కండరాల్లో ఉంటుంది. మెదడు, గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాల్లోనూ కనిపిస్తుంది. అందుకే థయమిన్ లోపించటం కండరాలు, అవయవాల మీద విపరీత ప్రభావం చూపుతుంది. థయమిన్ తగ్గితే కణాల్లో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి పెరిగిపోతుంది. ఒంట్లో క్షార స్వభావం తగ్గిపోయి ఆమ్లగుణం ఎక్కువవుతుంది. ద్రవాల మోతాదులూ పెరుగుతాయి. దీంతో గుండె మరింత బలంగా, ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె సామర్థ్యాన్ని దెబ్బతీసి, వైఫల్యానికి దారితీస్తుంది. కార్డియాక్ బెరిబెరి అంటే ఇదే. దీన్నే వెట్ బెరిబెరి అనీ అంటారు.
కొన్నిసార్లు చిన్నారుల్లో ఇది ఉన్నట్టుండి తలెత్తటం పెద్ద సమస్య. నాలుగైదు ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల పిల్లల్లో తరచూ ఇది కనిపిస్తుండటం ఆందోళనకరం. తెలంగాణలో నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలుతో పాటు గుంటూరు, ఒంగోలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గత ఏడాదిన్నరగా దీని బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది కూడా. వీరిలో 90% మంది శిశువులే. ముఖ్యంగా 3-6 నెలల పిల్లలు ఎక్కువ. పెద్ద పిల్లల్లో 6-15 ఏళ్ల వారిలోనూ ఇది కనిపిస్తోంది. చాలామంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే.
తక్కువ మొత్తంలో థయమిన్
థయమిన్ స్థాయులు మామూలుగా లీటరుకు 66-200 నానోమోల్స్ ఉండాలి. వీరిలో 10 నానోమోల్స్ కన్నా తక్కువగా ఉంటున్నాయి. వీరంతా హఠాత్తుగా ఆయాస పడుతుండటం, డొక్కలు ఎగరేయటం, గొంతు పీచుగా అవ్వటం, పాలు తాగలేకపోవటం, ఏడ్వలేని స్థితిలో ఆసుపత్రులకు వస్తుండటం గమనార్హం. సమస్యేంటో అంతుబట్టక, సరైన చికిత్స అందక ఎంతోమంది మరణించిన సందర్భాలూ ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇది కార్డియాక్ బెరిబెరి అని, థయమిన్ లోపంతో తలెత్తే సమస్యని చాలామందికి తెలియకపోవటమే.
నిర్ధారణ ఎలా?
చాలావరకు లక్షణాలను బట్టే గుర్తించొచ్చు. ముఖ్యంగా తల్లిపాల మీదే ఆధారపడిన పిల్లల్లో ఆయాసం వంటివి కనిపిస్తే కార్డియాక్ బెరిబెరిగా అనుమానించాలి. స్టెతస్కోప్‌తో పరీక్షించినపుడు గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవటం, గుండె చప్పుడు ఏదో గొణిగినట్టు (మర్‌మర్స్) వినిపిస్తే తాత్సారం చేయరాదు. వీరిలో రక్తపోటు పై సంఖ్య, కింది సంఖ్య మధ్య వ్యత్యాసం అధికంగా ఉంటుంది (పల్స్ ప్రెజర్). పెద్ద పిల్లల్లోనైతే నాడి, మెడ దగ్గర సిర వేగంగా, బలంగా కొట్టుకుంటుంది. కాలేయం పెద్దగా అవటం వల్ల కడుపు మీద చేయి పెట్టి నొక్కితే పిల్లలు విపరీతంగా ఏడుస్తారు. ఎక్స్‌రే తీస్తే గుండె పెద్దగా ఉంటుంది. స్కానింగ్ చేస్తే కవాటాల నుంచి రక్తం ఎక్కువగా ప్రవహిస్తున్నట్టు, గుండె పనితీరు తగ్గినట్టు బయటపడుతుంది. చాలావరకు వీటి ద్వారానే సమస్య నిర్ధారణ అవుతుంది.
ఎందుకిలా?
కార్డియాక్ బెరిబెరి గలవారిలో రక్తం పలుచబడిపోతుంది. మూత్రం రూపంలో నీరు సరిగా బయటకు వెళ్లకపోవటం వల్ల తిరిగి రక్తంలో కలుస్తుంది. దీంతో ఒంట్లో ద్రవాల మోతాదులు గణనీయంగా పెరిగిపోతాయి. ఇది గుండె, ఊపిరితిత్తుల మీద తీవ్ర భారం పడేలా చేస్తుంది. ఊపిరితిత్తుల్లో పీడనం గణనీయంగా పెరుగుతుంది (పల్మనరీ హైపర్‌టెన్షన్). మామూలుగా ఊపిరితిత్తుల్లో పీడనం 25-30 ఉంటుంది. ఇది వీరిలో బాగా ఎక్కువవుతుంది. దీన్ని గుండె కుడి జఠరిక (వెంట్రికల్) తట్టుకోలేదు. క్రమంగా గుండె సామర్థ్యం మందగిస్తుంది. గుండె గదులన్నీ పెద్దగా అవుతాయి. కవాటాల నుంచి రక్తం లీకవుతుంది. మరోవైపు అవయవాలకు తగినంత రక్తం సరఫరా చేయటానికి గుండె మరింత బలంగా, ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇలా విపరీతమైన భారం పెరగటం వల్ల ఉన్నట్టుండి గుండె వైఫల్యం తలెత్తుతుంది.
లక్షణాలేంటి?
కణాలకు తగినంత శక్తి లభించకపోవటం వల్ల పిల్లలు బలహీనంగా కనిపిస్తారు. గుండె వైఫల్యం మూలంగా ఆయాసం, డొక్కలు ఎగరేయటం, పాలు తాగలేకపోవటం, పీచు గొంతు, ఏడ్వలేకపోవటం, కాళ్లు లేదా కడుపు వాపు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ముఖం, రెప్పలు ఉబ్బుతాయి. అరుదుగా కాళ్ల వాపులూ రావొచ్చు. ఆరేళ్లు దాటిన పిల్లల్లో కాళ్ల వాపులు, కొంచెం దూరమైనా నడవలేకపోవటం వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి.
సత్వర చికిత్స అవసరం
కార్డియాక్ బెరిబెరిని అనుమానిస్తే సత్వరం చికిత్స చేయటం ముఖ్యం. ఇది చాలా తేలికైంది, చవకైంది, సురక్షితమైంది కూడా. థయమిన్ మోతాదుల పరీక్ష చేయకపోయినా ముందుగానే చికిత్స మొదలెట్టటం ప్రధానం. ఎందుకంటే మనదేశంలో థయమిన్ లోపాన్ని నిర్ధారింంచే పరీక్ష అందుబాటులో లేదు. అందువల్ల వీలైనంత త్వరగా తల్లికీ బిడ్డకు ఇద్దరికీ 50-100 మి.గ్రా. మోతాదులో థయమిన్ ఇంజెక్షన్లు ఇవ్వటం మంచిది. ఒక ఇంజెక్షన్‌తోనే సమస్య కుదురుకుంటుంది. ఇంజెక్షన్ ఇచ్చాక ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష చేస్తే పరిస్థితి కుదురుకున్నదీ లేనిదీ బయటపడుతుంది. బిడ్డ కోలుకున్నాక నాలుగు వారాల పాటు 10-50 మి.గ్రా. మోతాదులో థయమిన్ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి చాలా చాలా చవక. ఇటీవల తల్లికి థయమిన్ లోపం మూలంగా పిండంలోనూ గుండె పెద్దగా అయ్యి, నీరు పట్టటమూ చూస్తున్నాం. వీరికి థయమిన్ ఇస్తే పిండం కుదురుకోవటం గమనార్హం.
- ఇంజెక్షన్ ఇచ్చిన రెండు గంటల్లోనే కవాటాల్లోంచి రక్తం లీక్ కావటం పూర్తిగా ఆగిపోవటం, గుండె గదుల సైజు తగ్గటం విశేషం
గుర్తించకపోతే ప్రమాదమే
కార్డియాక్ బెరిబెరిని గుర్తించటం కష్టం. దీని లక్షణాలను ఇతర సమస్యలుగా పొరపడే ప్రమాదముంది. ఆయాసం, డొక్కలు ఎగరేయటం వంటి వాటిని న్యుమోనియా, బ్రాంకైటిస్ లక్షణాలుగా భావించే అవకాశముంది. ఊపిరితిత్తుల్లో అధిక రక్తపోటు (ప్రైమరీ పల్మనరీ హైపర్‌టెన్షన్), గుండె కండరం మందం కావటం (కార్డియో మయోపతీ), ఊపిరితిత్తుల్లో చిన్న సిరల్లో అడ్డంకి (పల్మరీ వీనో అక్లూజివ్ డిసీజ్) వంటి జబ్బులుగానూ పొరపడొచ్చు. ఇలా ఇతర సమస్యలుగా భావించి చికిత్స చేస్తే బిడ్డ మరణించే ప్రమాదముంది. ఎందుకంటే థయమిన్ లోపంతో గుండె పరిస్థితి అతి వేగంగా దిగజారుతుంది.
నివారణ సాధ్యమే
బాగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కడుపు నింపుతుండొచ్చు గానీ థయమిన్ వంటి పోషకాలు అందవు. బియ్యం మీదుండే తవుడు పొరలోనే థయమిన్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు, పప్పులు, పండ్లు తగినంత తీసుకోకపోవటమూ థయమిన్ లోపానికి దారితీస్తోంది. కొన్నిప్రాంతాల్లో బాలింతలకు కారంతోనే అన్నం పెడుతుంటారు. ఇందులో పోషకాలేవీ ఉండవు. దీంతో తల్లికి థయమిన్ తగ్గిపోతుంది. చనుబాలలో థయమిన్ ఏమాత్రం ఉండటం లేదు. ఇది పిల్లల్లో థయమిన్ లోపానికి కారణమవుతోంది. ఏడాది దాటిన పిల్లలు ఏదో రకంగా కూరగాయలు, పండ్లు తింటుంటారు కాబట్టి ఎంతో కొంత థయమిన్ లభిస్తుంది. అందుకే పూర్తిగా తల్లిపాల మీదే ఆధారపడే పిల్లల్లో లోపం ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు.
- బాగా పాలిష్ చేసిన బియ్యానికి బదులు దంపుడు బియ్యం, ఒక పట్టు బియ్యం తినటం మంచిది. ఉప్పుడు బియ్యం (పార్‌బాయిల్డ్ రైస్) తిన్నా మేలే. బియ్యం మరీ ఎక్కువ కాలం నిల్వ ఉన్నా థయమిన్ క్షీణిస్తుంది. నిల్వ ఉన్న బియ్యాన్ని మళ్లీ పాలిష్ పట్టొద్దు.
- అన్నం వండేటప్పుడు గంజి వార్చకూడదు. ఒక పూట గోధుమలు, జొన్నలు, సజ్జల రొట్టెలు తీసుకోవాలి. నిండు గింజ ధాన్యాలు, పొట్టుతీయని గోధుమ బ్రెడ్డు, పాలు, పప్పులు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులైతే వీలున్నప్పుడు మాంసం తినాలి. ప్రభుత్వం ఒక పట్టు బియ్యమే అమ్మాలని మిల్లర్లకు సూచించటం మంచిది.
ఇదీ చదవండి : నడుం నొప్పా? అది మానసిక ఒత్తిడేమో!