వయసుతో పాటు తలెత్తే మెదడు సమస్యల్లో ప్రధానమైంది అల్జీమర్స్. పైకేమీ తెలియకుండానే.. చాప కింద నీరులా దొంగదెబ్బ తీస్తూ వస్తుంది. డిమెన్షియా(మతిమరుపు)లో ఒక రకమైన ఇది చివరికి ఆత్మీయులనూ గుర్తుపట్టలేని స్థితికి చేర్చి జీవితాన్ని దుర్భరం చేస్తుంది. మనదేశంలో 60 ఏళ్లు దాటినవారిలో 60 లక్షల మందికి డిమెన్షియా ఉండొచ్చని అంచనా. వీరిలో 70% మంది అల్జీమర్స్ (తీవ్ర మరుపు) బాధితులే! డిమెన్షియాకు 50 ఏళ్లలోనే బీజం పడుతోంది. ఇది 60 ఏళ్లు వచ్చేసరికి జబ్బుగా బయటపడుతోంది. మధుమేహం దీన్ని మరింత త్వరగా ముంచుకొచ్చేలా చేస్తుండటమే సమస్య. ఎందుకంటే మధుమేహంలో మెదడు సామర్థ్యం మరింత వేగంగా క్షీణిస్తూ వస్తుంది. కాబట్టే మధుమేహం, అల్జీమర్స్- రెండూ కలిసే ఉంటుండొచ్చనే భావన బలపడుతోంది. మధుమేహులకే కాదు, ముందస్తు మధుమేహం (ప్రిడయాబెటిస్) గలవారికీ విషయగ్రహణ (కాగ్నిటివ్) సామర్థ్యం క్షీణిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇది క్రమంగా డిమెన్షియాకూ దారితీస్తుంటుంది. మధుమేహం లేనివారితో పోలిస్తే మధుమేహం గలవారికి డిమెన్షియా వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. ముందస్తు మధుమేహుల్లోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వాటితో తలెత్తే వ్యాస్కులర్ డిమెన్షియా కూడా మధుమేహుల్లో రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. మరోవైపు కొవిడ్ వచ్చిన తర్వాత మధుమేహుల్లో మరింత ఎక్కువమందిలో డిమెన్షియా, అల్జీమర్స్ బయటపడుతున్నాయి. కొవిడ్ లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా వీటి ముప్పు పెరుగుతుండటం గమనార్హం. మరో 25 ఏళ్లలో డిమెన్షియా బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశముంది. కొన్నిసార్లు ఇది అల్జీమర్స్‌కు తొలిదశ లక్షణమూ కావొచ్చు. కాబట్టి ముందు నుంచే అంతా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది.
మతిమరుపు సహజమే కానీ..
మతిమరుపు సహజమే. రోజూ ఏదో ఒకటి మరచిపోతూనే ఉంటాం. వయసుతో పాటు ఎక్కువవుతూ వస్తుంటుంది కూడా. దీంతో పెద్ద ఇబ్బందేమీ లేదు. కానీ అల్జీమర్స్‌తోనే సమస్య. మామూలు మతిమరుపులో మరచిపోయిందేటనేది తెలుస్తుంది. ఏం మరచిపోయామనేదీ గుర్తుంటుంది. ఉదాహరణకు- ఎవరైనా ‘ప్రాణ స్నేహితుడి పేరు మరచిపోయాను’ అని అన్నారనుకోండి. పేరు మరచిపోయి ఉండొచ్చు గానీ స్నేహితుడు ఉన్నాడనే సంగతి గుర్తుంటుంది. తర్వాత ఎప్పుడో పేరు గుర్తుకొస్తుంది. ఇది మామూలే. చాలామందిలో చూస్తుంటాం. కానీ అల్జీమర్స్ వేరు. అసలు మరచిపోయిన సంగతే తెలియదు. ఇందులో విషయ గ్రహణ సామర్థ్యం దెబ్బతింటుంది. స్వల్పకాల జ్ఞాపకశక్తి పోతుంది. వ్యక్తి స్వభావం గణనీయంగా మారిపోతుంది. ప్రవర్తనలోనూ మార్పులు తలెత్తుతాయి.
అనుమానించటమెలా?
దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారికి అల్జీమర్స్, కుంగుబాటు కూడా ఉండొచ్చని గుర్తించాలి. ఇది తెలియకపోతే ఇలాంటి జబ్బులు రావొచ్చనే అనుమానమే కలగదు. కొన్ని ప్రశ్నల ఆధారంగా కుంగుబాటును గుర్తించొచ్చు. అయితే అల్జీమర్స్‌ను పోల్చుకోవటం కష్టం. డిమెన్షియా నుంచి అల్జీమర్స్‌కు మారే క్రమంలో ఎలాంటి లక్షణాలు పొడసూపుతాయనేది కచ్చితంగా తెలియదు. ప్రవర్తనను బట్టి అంచనా వేయొచ్చు. చాలామంది తమకు అల్జీమర్స్ వచ్చిందేమోనని భయపడిపోతుంటారు. ఇలా ఎవరైనా అనుమానిస్తుంటే వారికి లేదనే అనుకోవాలి! ఎందుకంటే అల్జీమర్స్ ఉన్నవారికి ఆ విషయమే తెలియదు. దీని బారినపడ్డవారికి పాత విషయాలు బాగానే గుర్తుంటాయి. కానీ కొత్త విషయాలే గుర్తుండవు. ఏదైనా కొనటానికి వెళ్లి నోటు ఇచ్చి, చిల్లర తీసుకోవటం మరచిపోవచ్చు. ఇంట్లోంచి బయటకు వచ్చాక దారి తప్పిపోవచ్చు. ఒకచోట పెట్టాల్సిన వస్తువులను మరోచోట పెడుతుండొచ్చు. నిర్ణయాలు తీసుకునే శక్తీ తగ్గుతుంది. క్రమంగా కాళ్లు చేతుల కదలికలూ తగ్గుతాయి. అందువల్ల అల్జీమర్స్‌తో బాధపడేవారి కన్నా పక్కనుండే వారికే దీని గురించి తెలుస్తుంది. కొత్త సంఘటనలను, విషయాలను అదేపనిగా మరచిపోతున్నా, ప్రవర్తనలో తేడా కనిపించినా అల్జీమర్స్‌ను అనుమానించాలి.
రెండింటికీ సంబంధమేంటి?
మధుమేహంతో అల్జీమర్స్, డిమెన్షియా ముంచుకురావటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.
మెదడులో గ్లూకోజు ఎక్కువగా ఉండటం: దీర్ఘకాలంగా రక్తంతో పాటు మెదడులోనూ గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉండటం వల్ల విషయగ్రహణ దెబ్బతింటుంది. గ్లూకోజు మోతాదులు మరీ ఎక్కువగా పడిపోవటమూ.. గ్లూకోజు హెచ్చుతగ్గులు మరీ అధికంగా ఉండటమూ కారణం కావొచ్చు.
ఇన్సులిన్ నిరోధకత: ఇన్సులిన్‌కు కణాలు సరిగా స్పందిచకపోతే (ఇన్సులిన్ రెసిస్టెన్స్) రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. టైప్ 2 మధుమేహానికి కారణం ఇదే. ఇన్సులిన్ నిరోధకత మెదడులోనూ తలెత్తొచ్చు. మెదడులో ఇన్సులిన్ పనితీరు భిన్నంగానూ ఉంటుంది. ఇది అక్కడ గ్లూకోజును శక్తిగా మార్చటంతో పాటు నాడీ సమాచార వాహకాల విడుదల మీదా పనిచేస్తుంది. మెదడులో ఇన్సులిన్ మోతాదులు పెరగటం, మెదడు కణాలు ఇన్సులిన్‌ను సరిగా స్వీకరించకపోవటం వల్ల అమీలాయిడ్ బీటా పెప్టైడ్ ఉత్పత్తి పెరిగి, అది గార మాదిరిగా అట్టుకడుతుంది. దీంతో నాడీ పోచలు ముళ్లు పడిపోతాయి. ఫలితంగా నాడీ కణాల మధ్య సమాచారం నిలిచిపోతుంది. నాడీ కణాలు చనిపోతూ వస్తాయి. మరోవైపు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) కూడా ప్రేరేపిత మవుతుంది. క్రమంగా మెదడు క్షీణిస్తూ వస్తుంది.
సూక్ష్మరక్తనాళాలు దెబ్బతినటం: మధుమేహంలో సూక్ష్మ రక్తనాళాలూ ప్రభావితమవుతాయి. ఫలితంగా రెటీనోపతీ, న్యూరోపతీ సమస్యలు మొదలవుతాయి. నాడులకు రక్త సరఫరా చేసే కేశ రక్తనాళికలూ దెబ్బతింటాయి. ఇది విషయగ్రహణ, జ్ఞాపకశక్తి తగ్గటానికి దారితీస్తుంది.
జన్యువులు: మధుమేహంతో ముడిపడిన ఎపొఈ జన్యువు వ్యక్తం కావటమూ అల్జీమర్స్ ఆరంభం కావటానికి కారణం కావొచ్చు. ఇది మెదడులో అమీలాయిడ్ బీటా ప్రొటీన్ ఎక్కువయ్యేలా చేస్తుంది.
అధిక బరువు: అధిక బరువు మధుమేహానికే కాదు, అల్జీమర్స్‌కూ ముప్పు కారకమే.
చికిత్స ఏంటి?
అల్జీమర్స్ వచ్చాక నయం చేసే కచ్చితమైన చికిత్స ఏదీ లేదు. తొలిదశలో గుర్తిస్తే కొన్ని మందులతో లక్షణాలను కొంతవరకు తగ్గించొచ్చు. నిజానికి మధుమేహం తగ్గటానికో చికిత్స, అల్జీమర్స్ తగ్గటానికో చికిత్స అక్కర్లేదు. గ్లూకోజు అదుపులో ఉండటానికి తోడ్పడేవన్నీ అల్జీమర్స్‌కూ ఉపయోగపడతాయి. కాబట్టి గ్లూకోజు అదుపులో ఉంచుకోవటం అన్నింటికన్నా ముఖ్యం. ఇందుకు ఇన్సులిన్, మెట్‌ఫార్మిన్.. లిరాగ్లుటైడ్ వంటి జీఎల్‌పీ-1 రకానికి చెందిన మందులు, పయోగ్లిటజోన్ వంటి మందులు అల్జీమర్స్ నియంత్రణ, నివారణకు తోడ్పడతాయి.
- జీఎల్‌పీ-1, గ్లూకోజ్-డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలీపెప్టైడ్ (జీఐపీ) గ్రాహకాలను నేరుగా ప్రభావితం చేయగలిగితే అల్జీమర్స్ తగ్గే అవకాశముంది. ఇందుకు మెట్‌ఫార్మిన్ ఉపయోగపడుతుంది. ఇది జీఎల్‌పీ-1 ఉత్పత్తినీ పెంచుతున్నట్టు ఇటీవల బయటపడింది.
- సాధారణంగా ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో చర్మం కింద తీసుకుంటారు. ఇది రక్తంలోకి వెళ్లి, అక్కడ్నుంచి మెదడుకు చేరుకోవాలి. అయితే మెదడు, రక్తం మధ్య ఉండే అడ్డంకి (బ్యారియర్) దీన్ని నిలువరిస్తుంది. అందుకే ముక్కు ద్వారా ఇన్సులిన్‌ను ఇచ్చే స్ప్రే విధానాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ఇన్సులిన్ ముక్కు ద్వారా నేరుగా మెదడులోకి వెళ్లి, సమర్థంగా పనిచేస్తుంది.
- తొలిదశలో.. ప్రవర్తన పరమైన తేడాలను గుర్తించినప్పుడు అసిటైల్ కొలీన్ ఇన్‌హిబిటార్ రకం మందులతో కొంత ఫలితం ఉండొచ్చు. వీటితో లక్షణాలు తగ్గే అవకాశముంది. అల్జీమర్స్‌లో కోపోద్రిక్త స్వభావం వంటి మానసిక లక్షణాలూ ఉండొచ్చు. వీరికి మానసిక చికిత్సలో వాడే మందులు ఉపయోగపడతాయి.
ముందు నుంచే జాగ్రత్తలు
మధుమేహం బయటపడేసరికే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మొదలై ఉంటుంది. కాబట్టి గ్లూకోజు పెరిగిన తర్వాత జాగ్రత్తలు మొదలు పెట్టటమంటే నిప్పు అంటుకున్న తర్వాత నీళ్లు పోయటమే. మధుమేహం, అల్జీమర్స్ రెండింటికీ ముప్పు కారకాలు ఒకటే. కాబట్టి నివారణ మార్గాలూ ఒకటే. ముందు నుంచే జీవనశైలి మార్పులను పాటిస్తే వీటి బారినపడకుండా కాపాడుకోవచ్చు.
గర్భధారణ నుంచే మొదలు: ఇన్సులిన్ నిరోధకతను పెద్దయ్యాక గుర్తిస్తున్నాం గానీ దీనికి మనం తల్లి కడపులో ఉన్నప్పుడే బీజం పడుతుంది! తల్లి తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. తగినంత పోషకాహారం తినకపోతే బిడ్డ సన్నగా పుడుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. పైగా సన్నగా ఉన్నారని పిల్లలకు ఎక్కువెక్కువ ఆహారం తినిపిస్తుంటారు. దీంతో పెద్దయ్యాక లావుగా అవుతారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల బిడ్డ మరీ ఎక్కువ, మరీ తక్కువ బరువుతో పుట్టకుండా చూసుకోవాలి. కాన్పు తర్వాత బిడ్డకు చనుబాలు పట్టటం ముఖ్యం. ఇవి పేగుల్లో సూక్ష్మక్రిముల వృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. మన పేగుల్లో 2 కిలోల బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములుంటాయి. శరీరం, సూక్ష్మక్రిములు రెండూ ఒకదానిపై మరోటి ప్రభావం చూపుతాయి. పేగుల్లోని బ్యాక్టీరియా శరీరానికి సంకేతాలు పంపిస్తుంది. వీటిల్లో తేడాలు తలెత్తితే మధుమేహం, కుంగుబాటు వంటి రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. బొద్దు ఆరోగ్యం కాదు. పిల్లలు బొద్దుగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నారని అనుకోవటానికి లేదు. అనవసర బరువు మంచిది కాదు. కాబట్టి ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్ పిల్లలకు ఇవ్వద్దు. సమతులాహారం ఇవ్వాలి. కొవ్వు, నూనె పదార్థాలు, వేపుళ్లు, మిఠాయిలు మితంగానే ఇవ్వాలి.
నిద్ర: కంటి నిండా నిద్రపోకపోతే ఇన్సులిన్ నిరోధకత, శరీర బరువు పెరుగుతాయి. ఇవి మధుమేహంతో పాటు అధిక రక్తపోటు, గుండెపోటు ముప్పులనూ పెంచుతాయి. కాబట్టి అంతా 7-8 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోవాలి.
తినే వేళలు: ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనేవే కాదు.. ఏ సమయానికి భోజనం చేస్తున్నామన్నదీ ముఖ్యమే. భోజనానికి అల్పాహారానికి మధ్య కనీసం 3-4 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఆహారం అదే అయినా కాస్త వేళలు మార్చి తీసుకుంటే మధుమేహం, అల్జీమర్స్ ముప్పులు తగ్గటానికి తోడ్పడుతుంది.
వ్యాయామం: క్రమం తప్పకుండా నడవటం, పరుగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈదటం వంటి ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికే కాదు, మెదడుకూ మేలు చేస్తాయి. అందరికీ అన్నిసార్లూ ప్రత్యేకించి వ్యాయామం చేయటం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనైనా అటూఇటూ నడవాలి. ఒకదగ్గర బద్ధకంగా కూర్చోవటం కన్నా కదిలేలా చూసుకోవటం ముఖ్యం. రోజుకు సుమారు 8వేల నుంచి 10వేల అడుగులు వేయాలి. రోజులో ఎప్పుడైనా నడవొచ్చు. ఎంత వీలైతే అంత నడవాలి. తక్కువసేపు నడిచినా లాభమే. శరీరాన్ని సాగదీసే, బరువులను మోసే వ్యాయామాలూ అవసరమే. ఇవి కదలికలు సాఫీగా సాగటానికి, కండరాలు బలంగా ఉండటానికి తోడ్పడతాయి. వారానికి మూడు నాలుగు సార్లు నడక వంటి ఏరోబిక్ వ్యాయామాలు.. వారానికి ఒకట్రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు.. వీటితో పాటు శరీరాన్ని సాగదీసే ప్రయత్నం చేయాలి. వ్యాయామాల విషయంలో మధుమేహం గలవారు తగు జాగ్రత్తలు పాటించాలి.
ఎక్కువసేపు కూర్చోవద్దు: పొద్దున గంటసేపు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేశాం కదాని మిగతా సమయంలో కూర్చుంటామంటే కుదరదు. ఇది మంచిది కాదు. అదేపనిగా బద్ధకంగా కూర్చుంటే పొగ తాగటంతో సమానం. అంటే పొగ తాగటం వల్ల కలిగే అనర్థాలు కూర్చోవటం వల్ల సంభవిస్తాయని చెప్పుకోవచ్చు. గంటకోసారి అయినా కుర్చీలోంచి లేచి ఐదు నిమిషాల సేపు అటూఇటూ నడవాలి. మన శరీరం కదలటానికి, నిల్చోవటానికి అనుగుణంగా తయారైందే. కుర్చీలో కూర్చోవటమన్నది ఇటీవల అలవాటైంది గానీ ఒకప్పుడు ఏదో ఒక రూపంలో కదులుతూనే ఉండేవారు. ఇది తగ్గిపోవటమే ఇప్పుడు రకరకాల సమస్యలకు దారితీస్తోంది.
- ఇవన్నీ చేస్తే అల్జీమర్స్ అసలే రాదని కాదు. రావటానికి అవకాశం తక్కువగా ఉంటుంది. బరువు తగ్గించుకోవటం, కొవ్వు మోతాదులు అదుపులో ఉంచుకోవటం, శారీరక శ్రమ, వ్యాయామం చేయటం ద్వారా మెదడు పనితీరు మెరుగవుతుంది. మెదడు క్షీణించే వేగం నెమ్మదిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గుతుంది. ఇవి మధుమేహం, అల్జీమర్స్ నివారణకే కాదు.. తగ్గటానికీ తోడ్పడతాయి.
నిర్ధరణ కష్టం
అధిక రక్తపోటు, గ్లూకోజు మాదిరిగా అల్జీమర్స్‌ను కొలిచి, స్పష్టంగా నిర్ధరించే పరీక్ష ఏదీ లేదు. విషయగ్రహణ స్క్రీనింగ్ ఉంది గానీ దీన్ని సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ ఇద్దరూ కలిసి, ఓపికగా చేయాల్సి ఉంటుంది. అల్జీమర్స్ ఆనవాళ్లుంటే ఇందులో బయటపడతాయి.