Alcohol consumption effects on health : ఉద్యోగం వస్తే పార్టీ...పెళ్లి కుదిరితే పార్టీ... ప్రమోషన్ వస్తే పార్టీ...అలా ఎప్పుడో ఒకసారి అంటే సరే.. అనుకోవచ్చు. కానీ, నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ అంటే..? ఆ పార్టీలో మందు తప్పనిసరి అయితే..? ఇవాళా రేపూ జరుగుతున్నది అదే. వారాంతాల్లోనే కాదు, మామూలు రోజుల్లోనూ కిటకిటలాడే పబ్బులూ బార్లే అందుకు నిదర్శనం. చిన్నా పెద్దా లేదు. చేతిలో డబ్బుంటే చాలు. తాగడాన్ని ఎవరూ తప్పనుకోవడం లేదు సరికదా సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారు.
మందుబాబుల సంఖ్య పెరుగుతోంది..
ఐదారేళ్ల క్రితం పారిస్‌కి చెందిన ఒక ప్రముఖ సంస్థ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులపై మద్యపానం చూపే ప్రభావం గురించి వేర్వేరు దేశాల్లో అధ్యయనం చేపట్టింది. అప్పుడు తెలిసిన విషయాలు పరిశోధకులనే నివ్వెరపరిచాయి. గత ఇరవయ్యేళ్లలో మన దేశంలో మద్యపానం చేసేవారి సంఖ్య 55 శాతం పెరిగిందట. యువత అతిగా తాగుతోందనీ, అమ్మాయిలు కూడా ఏమీ తగ్గడం లేదనీ, పదిహేనేళ్లలోపే మద్యం రుచి చూస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిందనీ ఆ అధ్యయనం చెప్పింది. ఆ తర్వాత వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కలు కూడా దాన్ని బలపరిచాయి. మూడో వంతు పురుషులు అలవాటుగా మద్యం పుచ్చుకుంటున్నారని తేల్చాయి.
సరదాగా అయితే తప్పులేదు కానీ..
ఒకప్పుడు సిగరెట్ విపరీతంగా తాగేవారు. కానీ రాను రాను దాన్ని వ్యతిరేకించేవాళ్లు ఎక్కువయ్యారు. బస్సులోనో, ఆఫీసులోనో ఎవరైనా సిగరెట్ కాలుస్తూ కన్పిస్తే నిర్మొహమాటంగా అభ్యంతరం చెబుతున్నారు. దానివల్ల కావచ్చు, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకోవడంవల్ల కావచ్చు... మొత్తానికి పొగ తాగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ మద్యపానం విషయంలో మాత్రం పరిస్థితి తారుమారైంది. సమాజం దాన్ని ఆమోదించడమే కారణం కావచ్చంటున్నారు నిపుణులు. మద్యం మనసుకి ఉల్లాసాన్నిస్తుంది కాబట్టి, ఎప్పుడైనా ఓసారి సరదాగా తాగితే తప్పేంలేదన్న అభిప్రాయం సమాజంలో బలపడింది.
అనారోగ్యానికి ఆహ్వానమే..
కొంతకాలం క్రితం వరకూ మద్యం తాగే అలవాటు ఉంటే పిల్లనివ్వడానికి జడిసేవారు. ఇప్పుడు ఆ నియమం పెట్టుకుంటే పిల్ల పెళ్లి చేయడం కష్టమే అనేటట్లుగా తయారైంది పరిస్థితి. మొదట స్నేహితులతో సరదాగా మొదలయ్యే ‘ఎప్పుడైనా ఓసారి’ కాస్తా కొన్నాళ్లకే ‘అప్పుడప్పుడూ...’ అవుతుంది. ఆ తర్వాత ‘వారానికోసారి’ అయ్యి చివరికి- ప్రతిరోజూగా మారుతుంది. మద్యం తాగడం అలవాటైనవారిలో చెప్పుకోదగ్గ శాతం వ్యసనపరులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వ్యసనం దాకా వెళ్లక్కరలేదు, అసలు మద్యం తాగడమే అనారోగ్యానికి ఆహ్వానం పలకడమని వైద్యులు తేల్చి చెబుతున్నారు. తాగుడు ఎక్కువైతే లివర్ పాడైపోతుందని అనుకునేవారు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇటీవల వెలువడిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వారి పరిశోధనలో- ఆసియాలో నివసించేవారికి మద్యం వల్ల ముప్పు ఎక్కువనీ, పలు క్యాన్సర్లకు అది కారణమవుతోందనీ తెలిసింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఏటికేడాది పెరుగుతున్న క్యాన్సర్ కేసుల్ని గమనిస్తున్న నిపుణులు మద్యం అలవాటు మానుకొమ్మని హెచ్చరిస్తున్నారు.
కొంచెం తాగినా ప్రమాదమేనా?
కొంచెం తాగుతున్నారా, అప్పుడప్పుడూ తాగుతున్నారా... అన్నది విషయం కాదు. మద్యానికి ఎవరి శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. అందుకే తాగకుండా ఉండడానికే ప్రాధాన్యమివ్వమంటున్నారు డాక్టర్లు. గతంలో అరవై ఏళ్లు దాటినవారిలో కన్పించే క్యాన్సర్లూ ఇతర ఆరోగ్య సమస్యలూ ఇప్పుడు ముప్ఫైల్లోనే కన్పించడానికి కారణం అదేనట. పాశ్చాత్య దేశాలకన్నా తక్కువ మోతాదులోనే మద్యం తీసుకున్నా మనదేశంలో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకు జన్యుపరమైన కారణాలున్నాయనీ, మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై మన డీఎన్‌ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయనీ నిపుణులు చెబుతున్నారు.
తాగితే అసలేమవుతుంది?
మద్యం తాగినప్పుడు రెండు రకాల ప్రభావం కన్పిస్తుంది. తాగిన వ్యక్తికి మానసికంగా కలిగే హాయి ఒక రకమైతే, అది లోపలికి వెళ్లి శరీరంలో కలిగించే మార్పులు ఇంకో రకం. తాగేటప్పుడూ, ఆ తర్వాతా... రిలాక్స్‌డ్‌గా మత్తుగా ఉంటుంది. ఎవరేమనుకుంటారోననే సంకోచం లేకుండా తోచినట్లు ప్రవర్తిస్తారు. ఆ స్వేచ్ఛ వారికి ఆనందాన్నిస్తుంది. అది బాగుంది కదా అని ఇంకాస్త తాగితే- మాట తడబడుతుంది. చూపు, వినికిడిలో తేడా వస్తుంది. దాంతో మనుషుల్నీ వస్తువుల్నీ గుర్తుపట్టలేరు. వాంతులవుతాయి, తల తిరుగుతుంది. కొంతమందికి విరేచనాలవుతాయి. రెండురోజులపాటు తలనొప్పి వేధిస్తుంది. తరచూ మద్యం సేవించేవాళ్లు దానికి అలవాటుపడిపోతారు. దాంతో మొదట్లో ఉన్నంత కిక్ తర్వాత ఉండదు. అందుకని మోతాదు పెంచుతూ పోయి క్రమంగా దానికి బానిసలైపోతారు. తాగకుండా ఉండలేని దశకు చేరుకుంటారు. తాగి గమ్మున పడుకుంటే తెల్లారేసరికి మామూలైపోతుందనుకుంటారు. కానీ అలా జరగదు. కడుపులోకి చేరిన ఆ విషాన్ని తక్షణం బయటకు పంపడానికి శరీరంలోని వివిధ అవయవాలు పెద్ద యుద్ధమే చేస్తాయి.
ఎలా?
మద్యం తాగగానే అది కడుపు, చిన్నపేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. ఖాళీ కడుపుతో కనక తాగినట్లయితే కొద్దినిమిషాల్లోనే అది రక్తంలో కలిసిపోతుంది. అదే తాగేటప్పుడు ఇతర ద్రవపదార్థాలన్నా కనీసం నీళ్లైనా తాగితే, మంచి ఆహారం తీసుకుంటే, రక్తంలో కలిసే ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. ఒకసారి రక్తంలో కలవడమంటూ జరిగాక అది శరీరంలో మెదడుతో సహా అన్ని భాగాలకీ వెళ్తుంది. అందుకే ఆలోచనాశక్తి నుంచి అవయవాల మధ్య సమన్వయం వరకూ అన్నీ ప్రభావితమవుతాయి. ఊపిరితిత్తుల్లోకి చేరితే వదిలే గాలి ద్వారా తెలిసిపోతుంది. డ్రంకెన్ డ్రైవ్‌లో ముక్కు దగ్గర పెట్టి పరీక్ష చేసేది అందుకే. ఆ పరీక్ష రక్తంలో ఏ స్థాయిలో (బ్లడ్ ఆల్కహాల్ కాన్‌సెంట్రేషన్-బీఏసీ) ఆల్కహాల్ కలిసిందో చెప్పేస్తుంది. ఇలా అంతటా వ్యాపించిన ఆల్కహాల్‌ని శరీరం జీవభౌతిక క్రియలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందులో ఉన్న పోషకాల్నీ శక్తినీ తీసుకుంటుంది. అయితే ఈ చర్య చాలా మెల్లగా జరుగుతుంది. వైన్ అయినా బీర్ అయినా కొద్ది పరిమాణంలో నిదానంగా తాగితే మాత్రమే అది సాధ్యమవుతుంది. కాలేయంలో చేరిన ఆల్కహాల్‌తో అక్కడి ఎంజైమ్స్ చర్య జరిపి దాన్ని ఎసెటాల్‌డిహైడ్‌గా మారుస్తాయి. ఇది పెద్దమొత్తంలో ఉంటే విషంతో సమానం. అందుకని దాన్ని గబగబా విడదీసి ఎసెటేట్‌గా మార్చి శరీరం నుంచి బయటకు పంపడానికి కాలేయం తీవ్రంగా పనిచేస్తుంది. ఈ ఎసెటాల్‌డిహైడూ ఆల్కహాలూ కలిసి క్యాన్సర్లకు కారణమవుతాయి. అంతేకాదు, మన శరీరంలో నీటి శాతాన్ని తగు మోతాదులో ఉంచే వాసోప్రెసిన్ అనే హార్మోన్ తయారీని ఆల్కహాల్ అడ్డుకుంటుంది. దాంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఎసెటేట్, ఇతర వ్యర్థాలనూ శరీరం కార్బన్ డై ఆక్సైడ్, నీరు తదితర రూపాల్లో బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్‌ని శరీరం జీర్ణించుకునే సమయం కన్నా ఎక్కువ వేగంగా ఇలా బయటకు పంపే క్రియ జరుగుతుంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ డ్రింక్ తీసుకున్న కొద్దీ రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరిగిపోతుంది. అది అంచెలంచెలుగా అన్ని అవయవాల్నీ ప్రభావితం చేస్తుంది.
ఏ విధంగా?
మద్యం ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మార్పుకు లోనవని భాగం ఉండదంటే అతిశయోక్తి కాదు. అదెలాగంటే... హార్మోన్లు: డీహైడ్రేషన్ వల్ల హార్మోన్ల స్థాయుల్లో మార్పు పలు సమస్యలకు కారణమవుతుంది. కండరాలు పటుత్వం కోల్పోయి ఆల్కహాలిక్ మయోపతీ అనే సమస్య వస్తుంది. నొప్పి, నీరసంతో ఏ పనీ చేయలేరు.
కాలేయం: అదనపు కొవ్వు, మాంసకృత్తులు పేరుకుపోవడం వల్ల కాలేయం జబ్బులకు లోనవుతుంది. సిరోసిస్ వ్యాధికి దారితీస్తుంది. ఆల్కహాల్‌ని వడపోసే పని ఒత్తిడివల్ల కిడ్నీలూ చెడిపోతాయి.
క్లోమగ్రంథి: పాంక్రియాస్ పనితీరు దెబ్బతిని కడుపులో నొప్పి వస్తుంది. పాంక్రియాటిటిస్ అనే సమస్య కనక మొదలయ్యి దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. లివరూ పాంక్రియాస్ రెండిటి పనితీరూ చెడిపోతే అప్పుడు రక్తంలో చక్కెర స్థాయుల మీద నియంత్రణ లేక డయబెటిస్ వస్తుంది. షుగర్ వ్యాధికి మద్యం తోడైతే సమస్య మరింత జటిలమవుతుంది.
మెదడు: ఆల్కహాల్ వల్ల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. దేనిమీదా దృష్టిపెట్టలేరు. భావోద్వేగాలను నియంత్రిస్తూ జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని ఫ్రాంటల్ లోబ్ పాడైపోతుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్‌లాంటివి మొదలవుతాయి. తాగుడు అలవాటు దీర్ఘకాలం కొనసాగితే మొత్తంగా కేంద్ర నాడీవ్యవస్థే దెబ్బతింటుంది. దాంతో చేతులూ పాదాలూ స్పర్శ కోల్పోయినట్లు అవుతాయి.
సెక్స్: చాలామంది మద్యం తాగితే సెక్స్‌ని ఎక్కువగా ఆస్వాదించవచ్చని భావిస్తారు కానీ నిజానికి తాగడం వల్ల సెక్స్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి లైంగిక కోరికల పట్ల ఆసక్తీ, సామర్థ్యం తగ్గుతాయి.
మహిళలు: నెలసరి ఇబ్బందులు వస్తాయి. దీర్ఘకాలం తాగుడు అలవాటును కొనసాగిస్తే సంతానరాహిత్యానికి దారితీయవచ్చు. గర్భిణులు ఎంత కొంచెం తాగినా ప్రమాదమే. గర్భస్రావం, గర్భంలోనే బిడ్డ మరణించడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టినా ఆ పిల్లలకు దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. చదువులో, భావోద్వేగ నియంత్రణలో, పెరుగుదలలో లోపాలు ఉండవచ్చు.
కడుపు: అన్నవాహికలోని సున్నితమైన కణజాలం ఆల్కహాల్ ప్రభావం వల్ల పోషకాలనూ విటమిన్లనూ గ్రహించలేకపోతుంది. దాంతో క్రమంగా షోషకాహారలోపం తలెత్తి వ్యక్తి బలహీనమైపోతాడు. కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్దకం, పైల్స్ లాంటి సమస్యలూ వస్తాయి.
గుండె: అధిక రక్తపోటు, గుండె లయ తప్పడం, స్ట్రోక్, హార్ట్ ఎటాక్, గుండెవైఫల్యం... లాంటివేవైనా సంభవించవచ్చు. మధ్య వయసులో ఎక్కువగా తాగేవారికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.
ఎముకలు: మద్యంవల్ల ఎముకల సాంద్రత తగ్గి పలుచబడి తేలికగా విరిగిపోతాయి. చికిత్స చేసినా త్వరగా అతుక్కోవు.
వ్యాధి నిరోధకత: ఆల్కహాల్ శరీరంలో తెల్లరక్తకణాల తయారీని అడ్డుకుంటుంది. దాంతో వాటి సంఖ్య తగ్గిపోయి వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. న్యూమోనియా, క్షయ లాంటివి సోకే ప్రమాదం వీరికి ఎక్కువ.
క్యాన్సర్లు: నోరు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లకు ఇది కారణం అవుతోందని పరిశోధనలు తెలుపుతున్నాయి. పొగ తాగే అలవాటు కూడా ఉంటే క్యాన్సర్ల ప్రమాదం మరింతగా పెరుగుతుంది.
... ఇవన్నీ తాగిన వ్యక్తి శరీరంలోపల జరిగే మార్పులు. బయట సమాజంలో ఎదురయ్యే సమస్యలు మరో రకం. అవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి.
ఎలాంటి సమస్యలు?
మద్యపానం అలవాటైనవాళ్లకి తమ అవసరం తప్ప మరేమీ గుర్తుండదు. డబ్బంతా దానికే ఖర్చుపెడతారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో అశాంతికి దారితీస్తాయి. డబ్బుకోసమో, తన బలహీనతను కప్పిపుచ్చుకోవడానికో... భార్యాబిడ్డల మీద చీటికీ మాటికీ పోట్లాడడం, చేయిచేసుకోవడం మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో...
* చుట్టుపక్కల వారిమధ్య తలెత్తుకోలేక కుటుంబసభ్యులు ఆత్మన్యూనతకి గురవుతారు.
* భర్త బాధ్యతారాహిత్యం వల్ల కుటుంబ భారమంతా ఇల్లాలే మోయాల్సివస్తుంది. గృహ హింస కేసులకూ విడాకులకూ దారితీసే ముఖ్యకారణాల్లో ఇదీ ఒకటి.
* మద్యం మత్తులో విచక్షణ కోల్పోతారు. కుటుంబసభ్యులకే హానిచేస్తారు.
* తండ్రి వ్యసనపరుడైతే పిల్లలపై ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వాళ్లూ వ్యసనపరులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఆత్మన్యూనతతో నలుగురిలో కలవలేక, చదువులో రాణించలేక మంచి భవిష్యత్తుకు దూరమవుతారు.
* అనారోగ్యం వల్ల విధినిర్వహణలో విఫలమైతే ఉద్యోగం పోతుంది. వ్యాపారం దివాలా తీస్తుంది.
వ్యసనంగా మారినట్లు తెలిసేదెలా?
ఎప్పుడెప్పుడు తాగుతామా అని ఎదురుచూడడం, దొరికేదాకా చిరాకుపడడం, తాగడం మొదలుపెడితే ఆపలేకపోవడం, తమ ఆరోగ్యం పాడైపోయినా, కుటుంబ పరిస్థితులు దయనీయంగా ఉన్నా పట్టించుకోకుండా తాగుతూనే ఉండడం, సమయమూ డబ్బూ అన్నీ దానికోసమే ఖర్చుచేయడం, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడం... లాంటివి అందుకు నిదర్శనలు. ఆ స్థాయికి వచ్చాక బలవంతాన మాన్పించినట్లయితే విత్‌డ్రాయల్ సమస్యలు ఎదురవుతాయి. అవి మరింత ప్రమాదకరం.
వ్యసనానికి దారితీసే పరిస్థితులేమిటి?
ఒకేసారి ఎక్కువ మొత్తం తాగడం, తరచూ తాగడం, జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోలేక తాగడం, సన్నిహితుల్లోనో కుటుంబంలోనో తాగేవాళ్లు ఉండడం, జన్యుపరంగా ఆల్కహాల్‌పట్ల ఆసక్తి(తండ్రి, తాత, తోబుట్టువుల్లో ఎవరైనా వ్యసనపరులు ఉంటే దానిపట్ల ఆసక్తి పెరుగుతుంది), యాంగ్జైటీ, డిప్రెషన్, స్కిజోఫ్రెనియా లాంటి సమస్యలు ఉంటే... వ్యసనానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. చాలామంది ఇలాంటి పరిస్థితిలోనే... ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినప్పుడో, ఉద్యోగం కోల్పోయినప్పుడో మాత్రమే కుటుంబ సభ్యుల ఒత్తిడితో వైద్యుల్ని సంప్రదిస్తుంటారు.
ఎలాంటి చికిత్స ఇస్తారు?
ఈరోజుల్లో దాదాపు అన్ని నగరాల్లోనూ ఈ వ్యసనాన్ని మాన్పించే పునరావాస కేంద్రాలు(డీ-అడిక్షన్ సెంటర్స్) ఉన్నాయి. రోగులను కొన్నాళ్లు అక్కడ ఉంచుకుని మందులతో అలవాటును మరిచిపోయేలా చేయడమే కాక, కౌన్సెలింగ్‌తో, మంచి ఆహారంతో వారిని మానసికంగా భౌతికంగా కోలుకునేలా చేస్తారు. ఇంటికి వచ్చాక వారితో ఎలా మసలుకోవాలో కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తారు.
మరి వైద్యులేమంటారు?
మద్యపానం పట్ల సమాజ దృక్పథం మారాలంటారు మానసిక వైద్యులు డాక్టర్ రమణ చెరుకూరి. ‘తాగడమనేది ఈరోజుల్లో ఎంజాయ్‌మెంట్‌కి పర్యాయపదంగా, కల్చర్‌లో ఒక భాగంగా అయిపోయింది. అందరూ తాగుతున్నారు తప్పేముంది... అనుకుంటున్నారు. కానీ మద్యపానం అలవాటైన వాళ్లలో నూటికి పది నుంచి ఇరవై మంది అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెక్కన తాగేవాళ్లు పెరిగినకొద్దీ వ్యసనపరుల సంఖ్యా పెరుగుతోంది. అనారోగ్యాలు పెరుగుతున్నాయి. సమాజం దాన్ని మామూలు విషయంగా పరిగణించడం మానాలి. తాగుడు వల్ల కలిగే నష్టాల గురించి చర్చించాలి. ముఖ్యంగా పెద్దలు పిల్లలకు తరచూ చెబుతూ ఉండడమే కాదు, తాము కూడా ఆదర్శంగా నడచుకోవాలి. తాగుడు సరదా కానే కాదు, జీవితాన్ని నాశనం చేసే సమస్య. నిజానికి అది లేకుండా జీవితాన్ని ఎన్నో రకాలుగా ఆస్వాదించవచ్చు. క్రీడలూ కళల్లాంటివి హాబీలుగా ఎంచుకుంటే ఆరోగ్యమూ బాగుంటుంది. ఆనందమూ దక్కుతుంది. మంచి స్నేహితులూ దొరుకుతారు...’ అని చెబుతారు ఆయన.
చూశారుగా... మద్యపానం అలవాటు మనం జోకులు వేసుకుని నవ్వుకునే మామూలు విషయం కాదు...
ఆరోగ్యకరమైన రేపటి సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సీరియస్ విషయం..!
ప్రమాదకరం..!
సరదాగా చేసుకునే ఈ అలవాటు ఎంత ప్రమాదకరమంటే...
* మన కాలేయానికి గంటకి ఒక ఔన్సు మద్యాన్ని మాత్రమే ప్రాసెస్ చేయగల శక్తి ఉంటుంది. దానికి ఆ సమయం ఇవ్వకపోతే శరీరంలోని కీలక అవయవాలన్నీ ఒత్తిడికి గురవుతాయి.
* మద్యంతోపాటు సిగరెట్, కెఫీన్, డ్రగ్స్ లాంటివి ఉపయోగిస్తే అప్పటికప్పుడు ఉల్లాసంగా అన్పించవచ్చు. కానీ అది మోతాదు మించి తాగేందుకు ప్రేరేపిస్తుంది. పైగా తెలిసీ తెలియకుండా చేసే ప్రయోగాలు విపరీత పరిణామాలకు కారణమవుతాయి.
* మృత్యువుకు దారితీసే కారణాల్లో ప్రధానమైనదీ, నివారణ మన చేతుల్లో ఉన్నదీ- మద్యపానం. తాగి వాహనాలు నడిపేవారు చేసే ప్రమాదాల్లో ఏటా కొన్నివేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
* తాగిన మత్తులో హింసాత్మక, లైంగిక నేరాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది.
* చిన్నవయసులో తాగడం అలవాటైనవాళ్లు దానికి బానిసలయ్యే అవకాశం ఎక్కువ. పిల్లల్లో ఇరవైనాలుగేళ్లవరకూ మెదడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ వయసు లోపలే మద్యానికి అలవాటు పడితే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
అండగా... ఎన్నో సంస్థలు!
మద్యం అలవాటు మానాలనుకునేవారికి ఎన్నో స్వచ్ఛంద, ప్రభుత్వ సంస్థలు తోడ్పడుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆల్కహాలిక్స్ ఎనానిమస్ ఇండియా సంస్థ శాఖలు పెద్ద నగరాలన్నిట్లోనూ ఉన్నాయి. మద్యం అలవాటు ఏ స్థాయిలో ఉన్నా దాని నుంచి బయటపడడానికి అవసరమైన అన్నిరకాల సహాయమూ ఇక్కడ దొరుకుతుంది. సంస్థ వెబ్‌సైట్, హెల్ప్‌లైన్‌ల ద్వారా సంప్రదించి సందేహాలు తీర్చుకోవచ్చు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందవచ్చు. ఇందులో సభ్యుల సహకారంతో తమంతట తామే అలవాటును మానుకున్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు స్వచ్ఛంద కార్యకర్తలుగా ఇతరులకూ సాయం చేస్తుంటారు. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ హైదరాబాద్ హెల్ప్‌లైన్ నంబర్- 06301637367. విజయవాడ నంబర్- 8309611905. ఏపీలో 15 ప్రభుత్వాస్పత్రుల్లో డీ-అడిక్షన్ కేంద్రాలను ప్రారంభించగా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 8 డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా హోప్ ట్రస్ట్‌లాంటి స్వచ్ఛంద సంస్థలెన్నో ఈ సేవలను అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: Grand Nursery Mela: నర్సరీ మేళాకు విశేష స్పందన.. తరలివస్తోన్న మొక్కల ప్రేమికులు..