విటమిన్-డి... సహజ సిద్ధంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వైరస్, బ్యాక్టీరియాలను దరిదాపులకు రానివ్వదు. అలాంటి ఈ విటమిన్ వల్ల గుండె కూడా ఎంతో పదిలంగా ఉంటుందని తేల్చింది తాజా అధ్యయనం.
2001-12 మధ్య గ్రీస్‌లోని గ్రేటర్ ఏథెన్స్ ప్రాంతానికి చెందిన 1,514 మంది పురుషులు, 1,528 మంది మహిళలు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. విటమిన్-డి అధికంగా ఉన్న ఆహారం గుండెకు చాలా మంచిదని నిర్ధరించారు పరిశోధకులు. ఇందుకు సంబంధించిన వ్యాసం జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో ప్రచురితమైంది.
వ్యత్యాసం ఇలా...
విటమిన్-డి అతి తక్కువగా తీసుకున్న పురుషుల్లో 24%, మహిళల్లో 14% మందిలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చినట్లు గుర్తించారు పరిశోధకులు. విటమిన్-డితో కూడిన ఆహారాన్ని ఓ మోస్తరుగా తీసుకున్న పురుషుల్లో 17%, మహిళల్లో 10% మంది గుండె సమస్యలు ఎదుర్కొన్నారు. విటమిన్-డి చాలా ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో 12% మాత్రమే హృద్రోగాల బారిన పడ్డారు. మహిళల్లో మాత్రం ఈ సంఖ్య 11గా ఉంది.
విటమిన్-డి ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు పరిశోధకులు. ముఖ్యంగా పురుషులకు ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరుకు ప్రవాసుల భారీ ఆర్థిక సాయం