దేశంలో కొవిడ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అయితే... కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం... మొత్తం బాధితుల్లో 32% మంది కోలుకుంటుండటం కొంతలో కొంత ఊరట. సమస్య తీవ్రంగా ఉండి వెంటిలేటర్ వాడాల్సి వస్తున్న వారు 0.33% ఉంటున్నారు. ఆక్సిజన్ అందించాల్సిన వారు 1.5%, ఐసీయూలో పెట్టాల్సి వస్తున్న వారు 2.3% ఉంటున్నారు. కొవిడ్‌తో ఆరోగ్యం విషమిస్తున్న వారి శాతం గణనీయంగా పెరిగితే వెంటిలేటర్ల అవసరమూ అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ బాధితుడికి వెంటిలేటర్ ఎప్పుడు వాడాల్సి వస్తుంది. అది ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం..
ఊపిరితిత్తులే యుద్ధ భూములు
కొవిడ్-19పై పోరులో ఊపిరితిత్తులే యుద్ధభూములు. కరోనా కుటుంబానికి చెందిన సార్స్ కోవ్-2 వైరస్ వీటిని అతలాకుతలం చేసేస్తుంది. జబ్బు ఎంత తీవ్రమైతే ఊపిరితిత్తులు అంతగా దెబ్బతింటాయి. లోపల ద్రవాలు, చీము పేరుకుపోయి ఆక్సిజన్ మార్పిడి ప్రక్రియకు అడ్డుపడతాయి. దీంతో శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందదు. ఈ సమయంలోనే బాధితుల ప్రాణాలను నిలపడానికి వెంటిలేటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి బలంగా గాలిని పంపుతాయి. పేరుకుపోయిన ద్రవాలు, చీమునూ తొలగిస్తాయి. ఊపిరితిత్తుల్లోని అతి సూక్ష్మమైన గాలి గదుల సమన్వయంతో ఈ పనులను చేస్తాయి.
అవి అద్భుత నిర్మాణాలు
శరీరంలోని ఊపిరితిత్తులు సంక్లిష్ట అవయవాలు. మనం శ్వాస ద్వారా పీల్చుకున్న ఆక్సిజన్‌ను రక్తంలోకి చేరవేస్తాయి. అవయవాలన్నీ సక్రమంగా పని చేయడానికి ఊపిరితిత్తులు అత్యవసరం. ఇవి స్పాంజిలాంటి మెత్తటి రక్తనాళాల సముదాయం. ఇందులో అతి సూక్ష్మమైన, బుడగల ఆకారాల్లో గాలి గదులు ఉంటాయి. వీటినే అల్వియోలై అంటారు. రక్తంలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తుల్లోకి, ఊపిరితిత్తుల్లోని ఆక్సిజన్‌ను రక్తంలోకి మార్పిడి చేసే అత్యంత కీలకమైన పనిని నిర్వర్తించేవి ఇవే. అయితే... కరోనా బారిన పడిన వారిలో గాలి గదులు ఉబ్బిపోతున్నాయి. వాటిల్లో ద్రవం నిండిపోతోంది. ఫలితంగా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి ప్రక్రియ దెబ్బతింటోంది.
వెంటిలేటర్ ఎలా పనిచేస్తుందంటే...
శ్వాస ప్రక్రియ దెబ్బతిన్న వారి ప్రాణాలను కాపాడటానికి వెంటిలేటర్ అమితంగా తోడ్పడుతుంది. ఇది కొవిడ్‌ను నయం చేయలేదు గానీ కృత్రిమంగా శ్వాస తీసుకోవడానికి వీలు కల్పిస్తూ, ప్రాణాలను నిలుపుతుంది. అంటే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు సాయం చేస్తూనే, ఊపిరితిత్తులు కోలుకునేలా చేస్తుంది. వెంటిలేటర్‌ను ఒక రకంగా 'గాలి పంపు' అనుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ సాయంతో పనిచేసే దీనిలోని యంత్రాలు ఆక్సిజన్ స్థాయులు, గాలి ఒత్తిడి, గాలి పరిమాణం, శ్వాస వేగం వంటివన్నీ సమపాళ్లలో ఉండేలా చూస్తాయి. కొవిడ్ తీవ్రమైన వారిని చాలా రోజులపాటు వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది.
నిరంతర పరిశీలన
శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తుల్లోకి గొట్టాన్ని అమర్చడం చాలా కష్టమైన పని. బాధితులకు మత్తు మందును పెద్ద మోతాదులో ఇస్తే గానీ అది సాధ్యం కాదు. వారికి మెలకువ రాకుండా ఉండాలన్నా, గొట్టాన్ని బయటకు తీయాలన్నా మత్తులో ఉండాల్సిందే. ఒకవేళ గాలి ఒత్తిడి పెరిగితే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలి.
ప్రత్యామ్నాయాల వైపు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత ఉండటం, వెంటిలేటర్ మీద పెట్టినా ప్రాణాలు నిలుస్తున్న వారి శాతం అంతంత మాత్రంగానే ఉండటంతో వైద్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. గురక వంటి శ్వాస సమస్యలను తగ్గించే సీప్యాప్, బీప్యాప్, చవకైన గాలి పంపుల వంటి పరికరాలను వాడటానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు