నిర్ణయాలు, సమస్యలు, సంతోషాలు, అందోళనలు.. ఇవన్నీ రోజువారీ జీవితంలో ఓ భాగం. అయితే వీటి గురించి నిద్రపోయే ముందే ఆలోచించడం సర్వ సాధారణ. అతిగా ఆలోచించి నిద్రపట్టని రాత్రులు కూడా ఎన్నో ఉంటాయి. అయితే... ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ మనసును శాంతింపజేసుకుంటే.. ప్రశాంతమైన నిద్ర మీ సొంతం.
ఊపిరిపైనే అంతా..
గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఆ సమయంలో మీ దృష్టి అంతా దానిపైనే ఉండాలి. ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు లెక్కించండి. దీని వల్ల మీరు అతిగా ఆలోచిస్తున్న విషయాల నుంచి మీకు బ్రేక్ లభిస్తుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది.
మంత్రాలు...
మీకు నచ్చిన చిత్రాల్లో ఎన్నో మంత్రాలు, ఊతపదాలు ఉంటాయి. ఉదాహరణకు "ఆల్ ఈజ్ వెల్", "అంతా మన మంచికే". అతిగా ఆలోచిస్తున్నప్పుడు వీటిని మనసులో పదే పదే అనుకోండి. మనసు కుదుటపడుతుంది.
ధ్యానం...
నిద్రపోయే ముందు ధ్యానం చేయండి. మనసును ప్రశాంతపరిచి.. ప్రతికూల ఆలోచనలను ఇది తొలగిస్తుంది.
ఒత్తిడికి చెప్పండి 'నో'...
మీ రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకోండి. పడుకునేందుకు కనీసం ఒక్క గంట ముందు టెక్నాలజీకి దూరంగా ఉండండి. యోగా చేయండి. పుస్తకాలు చదవండి. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే నరాలకు ఉపశమనం కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.
వర్తమానం ముఖ్యం...
నిద్రపోయే ముందు మనకు వచ్చే ఆలోచనలు.. మన గతానికి లేదా భవిష్యత్తుకు సంబంధించి ఉంటాయి. గతంలో జరిగిన సంఘటనలను భవిష్యత్తుకు ముడిపెడుతూ ఉంటాం. ఇలా చేయకుండా వర్తమానంలో గడపడం మేలు.
ఆ అలవాట్లు వద్దు...
కాఫీ, ఆల్కహాల్‌కు నిద్రకు మధ్య వైర్యం ఉంది. అవి తాగితే నిద్రపట్టదు. అవి సేవిస్తే మనలో భయాందోళనలు పెరుగుతాయి. ఫలితంగా రాత్రంతా అతిగా ఆలోచిస్తూనే ఉంటాం. అందువల్ల సాయంత్రం 6 తర్వాత వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
బీ పాజిటివ్...
మంచి జ్ఞాపకాలు, సంతోషకర సంఘటనలను గుర్తుచేసుకోండి. మంచిపై ఎక్కువ దృష్టి పెడితే... మనకు అంతా మంచే జరుగుతుంది.
రాయడంలో ఉంది మజా...
మన ఆలోచనలను కాగితంపై రాయడం వల్ల వచ్చే ప్రశాంతత అంతా ఇంతా కాదు. రాత్రిపూట మీ నిద్రను చెడగొడుతున్న అంశాలను ఓ కాగితంపై రాయండి. అందుకోసం మీ మంచం పక్కన నిత్యం ఓ పుస్తకం ఉండాలి. దీని వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరకకపోవచ్చు. కానీ మీ మనసు కొంతవరకు కుదుటపడుతుంది.
ముఖ్యంగా కరోనా వైరస్ వంటి గడ్డు పరిస్థితుల్లో నిద్రలేమి తనంతో అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఈ చిట్కాలను పాటిస్తే నిద్ర దగ్గరవుతుంది. సమస్య దూరమవుతుంది. మరి మీరూ ప్రయత్నించేయండి!
ఇదీ చూడండి:- బార్లు, పబ్బుల్లో మద్యం విక్రయాలకు ఓకే!