వివిధ కళాత్మక రూపాలతో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దే పర్వంలో పెంబర్తి కవచాలు ఆలయానికి మరింత శోభను చేకూర్చనున్నాయి. కృష్ణశిలతో పంచ నారసింహుల సన్నిధిని రూపొందించారు. ఆలయ బయటి ద్వారాలకు ఇత్తడి తొడుగులను బిగించే పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పెంబర్తి కళాకారులతో వెండి, ఇత్తడి ద్వారాలను కనువిందుగా యాడా అధికారులు తయారీ చేయిస్తున్నారు. భక్తులకు మానసిక ఆహ్లాదాన్ని అందించేలా వీటిని పెంబర్తిలో అక్కడి కళాకారులు రూపొందిస్తున్నారు. లక్ష్మీ నారసింహుని ప్రధానాలయ గర్భాలయ ముఖద్వారాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దనున్నారు.
తామర రేకులు
ముఖద్వారానికి తామరపు రేకుల పనులు పూర్తవడంతో యాడా అధికారులు ఇందుకు సంబంధించిన సన్నాహాలు ఆరంభించారు. ఆ క్రమంలోనే ప్రధానాలయ గర్భగుడి ముఖద్వారం, రాజగోపుర కలశాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, తామర రేకులకు బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆలయ ఖజానా నుంచి 14 కిలోల బంగారం వినియోగిస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. సప్త రాజగోపుర ద్వారాలు, అంతర్ ప్రాకార మండపంలోని ఉత్తర, దక్షిణ దిశల్లోని ద్వారాలకు తామర రేకులను అమర్చే పనులను నిర్వహిస్తున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఆధ్యాత్మికత భక్తి భావం పెంపొందించే విధంగా కళాకారులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు.
సీఎం కేసీఆర్ ఆరా
తుదిదశకు చేరుకున్న క్షేత్రాభివృద్ధి పనులు గత ఇరవై రోజుల్లో ఏమేరకు పూర్తయ్యాయో ఫొటోలతో సహా సమాచారాన్ని సీఎం కేసీఆర్ సేకరిస్తున్నట్లు సమాచారం. దీంతో యాడా యంత్రాంగం యాదాద్రి క్షేత్ర పరిధిలో చేపట్టిన పనులను మరింత వేగవంతం చేసింది. గత నెల 21న కేసీఆర్.. క్షేత్ర సందర్శనకు వచ్చిన విషయం విదితమే. ఆలయాభివృద్ధిలో భక్తులకు అవసరమయ్యే వనరులను పూర్తిస్థాయిలో కల్పించాలని.. రెండున్నర నెలల్లో ఆ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించడంతో యాడా ఎప్పటికప్పుడు పనుల పురోభివృద్ధిపై దృష్టి సారించింది.
*సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో చేపట్టిన మార్పులుచేర్పులతో కూడిన పనుల తీరు, సాధించిన ప్రగతిపై ఫొటోలతో సమాచారాన్ని సీఎంకు పంపించేందుకు యాడా యత్నిస్తోంది.
*దైవ దర్శన వరుసల సముదాయం విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మాడ వీధిలో పసిడి వర్ణంలోని క్యూబాక్స్‌ల ఏర్పాట్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
*విష్ణు పుష్కరిణీ పునరుద్ధరణ, ప్రాసాదాల సముదాయానికి హంగులు, శివాలయంలో ఫ్లోరింగ్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు యంత్రాంగం తగు ప్రణాళికలు సిద్ధం చేసింది.
*కృష్ణ శిలతో మెట్ల దారి పునర్నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. కొండపై ఉత్తరదిశలో రక్షణ గోడ, పాత కనుమ దారి పనులు సైతం జరుగుతున్నాయి.
పనులను పరిశీలించిన సాంకేతిక కమిటీ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రాభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాడాకు చెందిన సాంకేతిక కమిటీ ఛైర్మన్ కొండల్ రావు సూచించారు. కొండపై చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపం లేకుండా తగు శ్రద్ధ చూపాలని కమిటీ సూచించింది. ఆలయాభివృద్ధితో సహా జరుగుతున్న ఇతర పనులను నిశితంగా పరిశీలించి త్వరలో పూర్తయ్యేందుకు తగు సూచనలు చేశారు. సీఎం పర్యటన అనంతరం క్షేత్రంలో పనుల పురోభివృద్ధిని పరిశీలించేందుకు శనివారం ఈఎన్‌సీలు బీఎల్‌ఎన్ రెడ్డి, రవీందర్ రావు, యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయిలతో వచ్చారు. ఆలయ ఈఓ గీత, ఎస్‌ఈ వసంత్ నాయక్, ఈఈ వెంకటేశ్వర్ రెడ్డిలతో పనులపై చర్చించారు.
ఇదీ చదవండి: BONALU: నేటి నుంచే ఆషాడమాస బోనాలు.. సర్వాంగ సుందరంగా ఆలయాలు