సృష్టికర్త బ్రహ్మ సారథ్యం మహావిష్ణువు, మహేశ్వరులతోపాటు సకల దేవతల సమక్షంలో శ్రీలక్ష్మీనృసింహుడి పరిణయోత్సవం కన్నులపండువగా సాగింది. ప్రధానాలయ విస్తరణ పనులతో ఈ ఏడాది సైతం కొండపైన బాలాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిశ్చయించిన ముహూర్తం ఉదయం 11 గంటలకు అగ్నిపూజ, స్వస్తివాచనం, యజ్ఞోపవీతం, పాద ప్రక్షాళనతో వేడుక దృశ్యకావ్యంగా నిలిచింది.
కమనీయ దృశ్యం
ఆకాశాన మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు, కాంతులు వెదజల్లే విద్యుద్దీపాలు... ఆహ్లాదాన్నిచ్చే రంగురంగుల పుష్పాలంకరణతో యాదగిరీశుని కల్యాణం కమనీయ దృశ్యంగా ఆవిష్కృతమైంది. ఉదయం11 గంటలకు బాలాలయ మండపంలో ఆలయ ఆచార్య బృందం శాస్త్రోక్త పర్వాలతో తిరుకల్యాణం జరిగింది. రెండు గంటల పాటు సాగిన కల్యాణ క్రతువులో దేవదేవుడు భక్తజనుల్ని కటాక్షించాడు. జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ పర్వంతో... స్వామి వారి లోక కల్యాణానికి శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
కొండ కింద పాత జడ్పీ పాఠశాల ప్రాంగణంలో జరిగిన వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితారామచంద్రన్ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు