యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 22న స్వామి వారి తిరు కల్యాణం జరగనుంది. ఇందులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని.. వీఐపీలందరికీ ఆహ్వానం పంపించామని ఆలయ అధికారులు తెలిపారు.
రక్షాబంధనంతో ప్రారంభమై..
కల్యాణానికి ప్రభుత్వం, తితిదే, పోచంపల్లి చేనేత సంఘం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఉదయం విష్వక్‌సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 25న రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తం కానున్నాయి. 16న ఉదయం ధ్వజారోహణం, రాత్రి భేరిపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. 17 నుంచి 23వ వరకు వివిధ అలంకార సేవలపై బాలాలయంలో స్వామిని విహరింపజేయనున్నారు.
డోలోత్సవంతో పూర్తి..
21న రాత్రి 8 గంటలకు బాలాలయంలో ఎదుర్కోలు, 22న ఉదయం తిరుకల్యాణం, రాత్రి 7.30కి కొండ క్రింద పాత హైస్కూల్ మైదానంలో వైభవోత్సవ కల్యాణం జరపనున్నారు. 23న రాత్రి 7 గంటలకు రథోత్సవం జరగనుంది. 24న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం శ్రీపుష్పయాగం, దేవతోధ్వాసన, దోపు ఉత్సవం చేయనున్నారు. 25న ఉదయం అష్టోత్తర శత ఘటాభిషేకం, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు పూర్తవుతాయి.
11 రోజులు నిలిపివేత..
బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు భక్తులచే జరిపే శాశ్వత, నిత్యా కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, శ్రీ సుదర్శన నరసింహ హోమం నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈసారీ ఉత్సవాలు బాలాలయంలోనే నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, సౌండ్ సిస్టమ్, యాగశాల, బలిపీఠం, వాహన సేవలను సిద్ధం చేశారు.
ఇదీ చూడండి: సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో సభాపతి పోచారం