Yadadri Temple Reopening : ఏడేళ్ల క్రితం చేపట్టిన ఘనమైన దీక్ష నేడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. అబ్బుర పరిచే వాస్తు శాస్త్ర నిర్మాణాలు, చూపు తిప్పుకోనివ్వని శిల్పకళా సౌందర్యాలతో..భక్తుల మనసు దోచు కునేందుకు సిద్ధమైంది యాదాద్రి క్షేత్రం. ఏళ్లుగా అణువణువూ శిల్పుల చేతిలో మెరుగులు దిద్దుకుంది ఈ ఆలయం. ఎన్నో ఆశలు, ఆలోచనల మధ్య ఈ శతాబ్దంలోనే ఎవరూ నిర్మించేందుకు సాహసించని తీరుగా పూర్తిగా కృష్ణశిలతో సరికొత్త రూపులోకి మారిపోయింది ఈ దేవాలయం. అద్భుత రీతిలో పునరుద్ధరణ పూర్తి చేసుకుని..సరికొత్త చరిత్రకు నాంది పలకనుంది. ఈ మహా దివ్య కోవెల ఈ నెల 28న మహా కుంభ సంప్రోక్షణతో సుసంపన్నం కానుంది. మూలవర్తుల దర్శనభాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తజనులకు దేదీప్యమానంగా దర్శనమివ్వనుంది. ఈ మహత్తర ఘట్టానికి అంకురార్పణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Yadadri Temple History : యాదగిరి క్షేత్రాన కొలువైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామిది ఎంతో ఘనమైన చరిత్ర. పురాణాల్లోనూ ఈ క్షేత్రానికి గొప్ప ప్రాశస్త్యమే ఉంది. ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం కావడంతో పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కోట్ల మంది భక్తులు, ఎన్నో కోరికలతో విచ్చేసే ఈ యాదగిరి గుట్టకు..క్షేత్రపాలకుడిగా నిత్యం ఆ ఆంజనేయుడే అండగా నిలుస్తుంటాడు. అందుకే ఆధునిక నిర్మాణాల్లోనూ ఆంజనేయుడికి ప్రత్యేక స్థానం కల్పించారు. లక్ష్మీ సమేతుడై ఇక్కడ కొలువైన నారసింహుని దర్శించుకుంటే తమ కోర్కెలు తీరుతాయని, కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తజనులు స్వామి వారి దర్శనభాగ్యం కోసం వస్తుంటారు. అంతటి ప్రఖ్యాత ఆలయం కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునరుద్ధరించింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో అద్భుత ఆలయంగా రూపుదిద్దుకొంది. భక్తుల సౌకర్యార్థం సువిశాలంగా విస్తరించింది.
Yadadri Lakshmi Narasimha Swamy Temple : 7 ఏళ్ల క్రితం ప్రారంభమై 6 ఏళ్ల నుంచి నిరంతరాయం పనులు జరుపుకుం టున్న ఈ ఆలయ పునరుద్ధరణ పనులు క్రమంగా కొలిక్కి వచ్చాయి. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ఇన్నాళ్లు బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి తిరిగి తన నివాసానికి చేరుకునేందుకు..సిద్ధమవుతున్నారు. ప్రధానాలయంగా దేదీప్యమానంగా వెలిగి పోతున్న గర్భగుడి నుంచి భక్త జనసందోహానికి అభయం ఇవ్వనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా ఉద్ఘాటన ప్రక్రియను నిర్వహించాల్సి ఉండగా అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Yadadri Temple News : వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీరామనుజ చినజీయర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వ హించనున్నారు. 7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకు మార్చి 21న అంకురార్పణ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయశాఖ అవసరమైన ఏర్పాట్లు చేశాయి.
Yadadri Lakshmi Narasimha Swamy Temple Reopening : సంప్రోక్షణలో భాగంగా వేద పారాయణాలు, మూల మంత్రాల జపం నిర్వహించనున్నారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు నిర్వహిస్తారు. స్వస్తి వాచనం, యజ్ఞ హవనములు, మూల మంత్ర హవనములు, సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం తదితర శాస్త్రోక్తక క్రతువులు.
ఉద్ఘాటన సందర్భంగా ప్రధానాలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంక రించారు. హైదరాబాద్ సహా ఇతర ముఖ్య నగరాలు, ప్రాంతాల నుంచి ప్రత్యేక తోరణాలు ఏర్పాటు చేశారు.
- ఇదీ చదవండి : పంచకుండాత్మక మహాయాగానికి ఇవాళ అంకురార్పణ