లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఖాళీగా కనిపించిన యాదాద్రి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది. సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకళ్యాణం, సువర్ణ పుష్పార్చన పూజలు, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు.
దర్శనానికి గంట సమయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తడంతో ఆలయ వ్రతమండపంలోని క్యూలైన్లు నిండిపోయాయి. సుమారు 25 వేల మంది స్వామివారి దర్శనం కోసం ఆలయాన్ని సందర్శించారని ఆలయ సిబ్బంది తెలిపారు. రద్దీ కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి గంట సమయం పట్టిందని భక్తులు చెప్పారు.
ఏర్పాట్లు చేసిన అధికారులు
రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సందర్శకులను ఆలయంలోకి అనుమతించారు. కొండ మీద ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతుండడంతో కొండ కింద తులసీ కాటేజీలో భక్తులకు వసతీ సౌకర్యం కల్పించారు. కొండపైకి వ్యక్తిగత వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో ఆటోలు, బస్సుల్లో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. స్వామివారి ఆలయ ఖజానాకు శనివారం రూ. 12,76,279 ఆదాయం సమకూరిందని ఆలయ సిబ్బంది వెల్లడించారు.
ఇదీ చదవండి: Hyderabad: శరవేగంగా విమానాశ్రయ నగరం