యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మి నరసింహస్వామివారి(sri lakshmi narasimha swamy) ఆలయంలో వేద ఆశీర్వచనం పూజా కైంకర్యాన్ని ఆలయ ఈవో గీతా రెడ్డి ప్రారంభించారు. గతంలో వీఐపీలు, వీవీఐపిలకు మాత్రమే వేద ఆశీర్వచనం చేసేవారు... కానీ ఆలయ అధికారుల తాజా నిర్ణయంతో రూ.516 టిక్కెట్ తీసుకునే భక్తులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. సాధారణ భక్తులు కూడా రూ.516 టికెట్ కొనుగోలు చేస్తే వేద ఆశీర్వచనం చేసుకునే అవకాశం కలగనుంది. ఆలయ ఈవో గీతారెడ్డి మొదటి టికెట్ తీసుకొని పూజలో పాల్గొన్నారు. వారికి పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనంతో పాటు ఆశీర్వాదాన్ని వేద పండితుల ద్వారా పొందేందుకు వేద ఆశీర్వచనం అందుబాటులోకి తీసుకొచ్చాం. రూ.516 టికెట్‌పై ఎవరైనా స్వామివారి అనుగ్రహాన్ని వేదపండితుల ద్వారా ఆశీర్వచననాన్ని పొందడానికి అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
-గీతారెడ్డి, ఆలయ ఈవో
లక్ష పుష్పార్చన
ఏకాదశి సందర్భంగా బాలాలయం మండపంలో అష్టోత్తర మూర్తులకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ రకాల పూలతో ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ప్రతి నెల ఏకాదశి రోజున ఆలయంలో స్వామి వారికి లక్ష పుష్పార్చన జరుపుతామని ఆలయ అర్చకులు తెలిపారు.
సామూహిక వ్రతాలు
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వ్రతాల్లో ఎక్కువ మంది భక్తులు పాల్గొనాలనే ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా వ్రతాలు చేయించే సదుపాయాన్ని కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిసారి ఇలాగే అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు
యాదాద్రిలో నారసింహుని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోరేశ్వర్ పాటిల్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి వేద ఆశీర్వచనాలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి లడ్డూప్రసాదాలు అందజేశారు.
ఇవీ చదవండి: