యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్ పురంలో జూన్ 14న జరిగిన ఎలిమినేటి సంజీవరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. పహిల్వాన్పురం గ్రామానికి చెందిన ఎలిమినేటి సంజీవరెడ్డికి, అదే గ్రామానికి చెందిన ఎలిమినేటి వెంకటరెడ్డి వ్యవసాయ బావులు పక్కపక్కనే ఉన్నాయి. వెంకట్రెడ్డి పొలంలో బోరు ఉంది. సంజీవరెడ్డి కూడా తన పొలంలో బోర్ వేశారు. రెండు బోర్ల మధ్య తేడా 100 మీటర్లు ఉంది. సంజీవరెడ్డి బోరు వల్ల తన బోరులో నీరు ఇంకిపోతాయని వెంకటరెడ్డి భావించాడు.
సంజీవరెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పన్నాగం వేశాడు. ఈనెల 14వ తేదీన సాయంత్రం సంజీవరెడ్డి తన భార్య అండలుతో కలిసి ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లారన్న విషయం తెలుసుకున్నాడు.వెంటనే వెంకట్ రెడ్డి గొడ్డలి తీసుకొని ద్విచక్రవాహనంపై సంజీవరెడ్డి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఘర్షణ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. వెంకట్ రెడ్డి తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో సంజీవరెడ్డిపై దాడి చేశాడు. తీవ్రగాయాలతో సంజీవరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న సంజీవరెడ్డి భార్య అండాలు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా చంపుతానని బెదిరించాడు. అనంతరం తన ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సంజీవరెడ్డి భార్య అండాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వెంకటరెడ్డిని భువనగిరిలో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.కేసును చాకచక్యంగా ఛేదించిన రామన్నపెట సీఐ వి.రంగాను, వలిగొండ ఎస్సే శివనాగప్రసాద్ను డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!