యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఆరాధనలు, శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయాన్నే ఆలయాన్ని తెరచి.. సుప్రభాత పూజలు, ప్రతిష్ట మూర్తులకు ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, సువర్ణ పుష్పార్చన పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం జరిపారు.
అనంతరం సాయంత్రం స్వామివారికి ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ మహోత్సవం జరిపించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు.
తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయంలో ముఖ మండపంలోని ఉయ్యాల్లో శయనిపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ, లాలి పాటలు పాడారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామాజిక దూరం, మాస్కులు ధరించి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చూడండి.. వనస్థలిపురం కనకదుర్గ ఆలయంలో వైభవోపేతంగా వార్షికోత్సవాలు