అధికార పలుకుబడితో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డి చేసిన భూదందాలకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో సీలింగ్ భూములు, ప్రభుత్వ భూముల ఆక్రమణపై భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015లో యాదాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తే జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
యాదగిరిగుట్ట సమీపంలో వందల ఎకరాల గుట్టలు తొలుస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని అయోధ్య రెడ్డి ప్రశ్నించారు. పేదల కోసం తమ పోరాటం ఆగదని... న్యాయం కోసం కోర్టునాశ్రయిస్తామని అన్నారు. చల్లూరు, మల్లాపూర్, గుండ్ల పల్లి, గౌరాయిపల్లి, దత్తారుపల్లిలో భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డికి ఈ అక్రమాల్లో సంబంధం ఉందని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"మాసాయిపేటలో 726, 851 సర్వే నంబర్లో 333 ఎకరాల సీలింగ్ భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఆ భూమిని విక్రయించడానికి వీలులేదు. కానీ హైదరాబాద్కి చెందిన వారు ఆ భూములను కొనుగోలు చేయగా... వారి నుంచి మారెడ్డి కొండల్ రెడ్డి, శ్రీశైలం కొనుగోలు చేశారని తెలిపారు. వారిద్దరూ ఆలేరు ఎమ్మెల్యే భర్త మహేందర్ రెడ్డి వ్యాపార భాగస్వాములు. వారు ఆ భూమిని ఓ కంపెనీకి 87 ఎకరాలు అమ్మేశారు. ఆ భూమిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు." -అయోధ్య రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి
ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'లో ఆ ఫైట్ కోసం 50 రాత్రులు