యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఎస్సై మహేశ్, కానిస్టేబుల్ రషీద్, జానయ్యలపై వేటు పడింది. ముగ్గురిని సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మరియమ్మ అనే మహిళ లాకప్ డెత్ ఘటనలో సీపీ మహేశ్ భగవత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో మల్కాజ్ గిరి ఏసీపీ శ్యాంప్రసాద్ రావును దర్యాప్తు అధికారిగా నియమించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని... సీపీ ఆదేశించారు.
ఇదీ జరిగింది...
గోవిందాపురం చర్చిఫాదర్ బాలశౌరి నివాసంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోనట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మ(55) వంట చేసేందుకు రెండు నెలల క్రితం చేరింది. ఈ నెల 3న ఆమె కుమారుడు అంబడిపూడి ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు వేముల శంకర్‌తో కలిసి గోవిందాపురంలోని తల్లివద్దకు వచ్చారు. ఫాదర్ వారిని చూసి.. ఎవరని ప్రశ్నించగా.. రెండ్రోజులు పనిమీద వచ్చారని తెలిపింది.
బీరువాలో రూ. 2 లక్షలు లేవని...
అనంతరం ఫాదర్ ఈనెల 5న పనిమీద హైదరాబాద్ వెళ్లారు. అదే రోజు నల్గొండలో ఉంటున్న ఫాదర్ బంధువు గోవిందాపురం వచ్చారు. ఇంట్లో ఉన్నవారిని చూసి.. ఫాదర్‌కు ఫోన్ చేశాడు. వారి ప్రవర్తనలో ఏదో తేడా ఉందని చెప్పడంతో.. వంటమనిషికి ఫాదర్ ఫోన్ చేశాడు. వారిని ఇంకా ఎందుకు పంపలేదని ప్రశ్నించాడు. ఈనెల 6న హైదరాబాద్ నుంచి తిరిగివచ్చిన ఫాదర్ ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న రెండు లక్షలు లేవని గమనించాడు.
పోలీసులకు ఫిర్యాదు...
అదే సమయంలో వంటమనిషి కుమారుడితో వచ్చిన వేముల శంకర్ కనిపించకపోవడంతో ఫాదర్ వంటమనిషిని నిలదీశాడు. తమకేమి తెలియదని వారు సమాధానమిచ్చారు. దీంతో ఫాదర్ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని... ముందుగా మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో... రూ.1.35 లక్షలను వారి ద్వారా రికవరీ చేసినట్లు పోలీసులు చెప్పారు.
స్పృహతప్పి పడిపోయిందని...
మిగిలిన రూ.65వేల కోసం ఈ నెల 18న మరియమ్మను పిలిపించి ప్రశ్నించగా ఆమె స్పృహతప్పి పడిపోయిందని... భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై వి.మహేశ్ చెప్పారు. కాగా ఆ సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు దారితీసింది. పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ చనిపోయిందని ఆమె కుటుంససభ్యులు ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్... ఎస్సై, కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందినట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: Cm Kcr: ఊరంతా కలిస్తేనే అభివృద్ధి... అప్పుడే బంగారు వాసాలమర్రి సాధ్యం