తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడం.. మేడారం జాతరకు వెళ్లి తిరిగి వచ్చే భక్తులూ కుటుంబ సమేతంగా పిల్లా పాపలతో రావడం వల్ల ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
స్వామివారి నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. ఫలితంగా స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.