యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. మొదటగా హైదరాబాద్-వరంగల్ వెళ్లే మార్గంలో శిల్పా హోటల్ నుంచి జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ముందుగా 50 అడుగులు విస్తరణ కోసం అయిన నిర్మాణాలను తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్రావు తెలిపారు.
ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని.. నిర్మాణాల తొలగింపు ఆపాలని భాజపా, కాంగ్రెస్ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా నిర్మాణాల తొలగింపును అధికారులు కొనసాగించారు.
దశల వారిగా ప్రభుత్వ కార్యాలయాలు అనంతరం అక్రమ ప్రైవేటు ఇళ్ల నిర్మాణాలనూ తీసివేస్తామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. భువనగిరి పట్టణంలో రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్య నుంచి ఇరు వైపులా 50 అడుగులు చొప్పున విస్తరించనున్నట్లు కమిషనర్ తెలిపారు. గత ఏడాదిగా దీనికి సంబంధించి రోడ్డు పక్కల ఉన్న చెట్లను తీసివేయటం, విద్యుత్ స్తంభాలు పక్కకు జరపడం చేశామని చెప్పారు. దుకాణాల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీచేశామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీచూడండి: 21 ఏళ్ల యువతిపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారయత్నం