Yadadri reconstruction works: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు యాదాద్రిని మహాదివ్యంగా తీర్చిదిద్దేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. కొండపై హరిహరుల ఆలయాల పునర్నిర్మాణం పనులు పూర్తికావొచ్చాయి. మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు కావడంతో కట్టడాలన్నింటినీ అప్పటిలోగా పూర్తి చేయాలని యాడా నిర్ణయించింది. ఈ క్రమంలో కొండ కింద చేపట్టిన ఆలయ పునఃనిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, త్వరితగతిన పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
దీక్షా మండపం
Yadadri temple reopen : భక్తి శ్రద్ధలతో దీక్ష చేపట్టే భక్తుల కోసం తగు వసతులతో దీక్షాపరుల మండపం 1.08 ఎకరాలలో నిర్మితమవుతోంది. రూ.8.90 కోట్లతో చేపట్టిన నిర్మాణం పనుల్లో పెయిటింగ్, ఆర్నమెంటల్ పనులు చేయాల్సి ఉంది. పురుషులు, మహిళలు వేర్వేరుగా ధ్యానం చేసుకునేందుకు హాళ్లు, ప్రత్యేక వంట గది, భోజనశాలతో పాటు మూత్రశాలలు, శౌచాలయాలు దివ్యాంగులకు వినియోగమయ్యేలా నిర్మించారు. ఈ నెలాఖరులోగా మండపం పూర్తి హంగులతో ఆవిష్కృతం కానుంది. రూ.21.48 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేశారు. కొండపై నుంచి గండి చెరువు వద్దకు చేరేందుకు ఫ్లై ఓవర్ వంతెన నిర్మితమవుతోంది. అక్కడికి చేరుకున్న భక్తులు మొక్కులు తీర్చుకునే ప్రాంగణాలకు వెళ్లే అంతర్గత దారుల నిర్మాణం 60 శాతం పనులు పూర్తయ్యాయి.
వ్రత మండపం
yadadri temple undates: భవిష్యత్తులో వచ్చే భక్తుల కోసం ఆలయానికి చెందిన వివిధ వసతుల కల్పనకు ప్రణాళికల ద్వారా రూ.86.08 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని పూర్తి దశకు చేరుకోగా, మరికొన్ని పనులు మొదలయ్యాయి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల మొక్కును తీర్చుకునేందుకు యాదాద్రిని భక్తులు మరో అన్నవరంలాగా భావిస్తూ ఈ క్షేత్రానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వస్తారు. ఆ వ్రతాల నిర్వహణకు కొండ కింద గండి చెరువు పరిసరాల్లో 1.33 ఎకరాల్లో వ్రత మండపం నిర్మితమవుతోంది. ప్రస్తుతం నాలుగు బ్లాకులుగా జరుగుతున్న నిర్మాణంలో పునాది పనులు పూర్తయ్యాయి. రెండు హాళ్లతో నిర్మితమవుతున్న ఈ మండపంలో ఒకేసారి 500 వ్రతాలను జరుపుకోవచ్చు.
కల్యాణ కట్ట నిర్మాణం
yadadri temple news: భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక కల్యాణకట్ట రెండున్నర ఎకరాల్లో రూ.20.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమవుతోంది. ఒకేసారి 520 మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేట్లు సదుపాయాలు కల్పిస్తున్నారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ప్రత్యేక సముదాయం నిర్మితమవుతోంది. దాతల నిర్మాణంతో ఈ భవనం రూపుదిద్దుకుంటోంది.
ఇదీ చదవండి: yadadri drone visuals: యాదాద్రి సుందర దృశ్యాలు.. చూపరులను కట్టిపడేసేలా నిర్మాణాలు