Yadadri Temple Reopening : : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంబాభిషేకం నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం చేపట్టనున్నారు. 21- 28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు.

Yadadri Temple News : ఈ నెల 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ చేయనున్నారు. స్వస్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు 21నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం నిర్వహించనున్నారు. బాలాలయంలో ఉద్ఘాటన పూజల నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు జరిపించుకోవాలని ఆలయ వర్గాలు సూచించాయి. ఈ నెల 18(శుక్రవారం) నుంచి పాతగుట్టలో శ్రీస్వామి, అమ్మవారల కల్యాణ మొక్కులను తీర్చుకోవచ్చని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలతో భారీ ఆదాయం..
వార్షిక బ్రహ్మోత్సవాలకు తెరపడటంతో మంగళవారం బాలాలయంలో నిత్యకల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు ఈవో తెలిపారు. హుండీల్లో 18 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయానికి భారీ ఆదాయం సమకూరిందని చెప్పారు. భక్తుల ద్వారా రూ.91,19,982 నగదు, 50 గ్రా. మిశ్రమ బంగారం, 2100గ్రా. వెండి సమకూరిందని అన్నారు.