యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన నల్లెంకి వెంకటేశ్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా.. గోసంరక్షణ వృద్దికి కృషి చేస్తున్నారు. నెలకు లక్ష రూపాయల ఆదాయాన్ని వీడి.. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో వ్యవసాయ క్షేత్రాన్ని అద్దెకు తీసుకుని ప్రత్యేక పద్దతుల్లో పశువుల పెంపకం చేపట్టారు. గుజరాత్ నుంచి తెచ్చిన గిర్ జాతి ఆవులను పెంచుతూ.. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలైన దూడలకు ప్రాణం పోస్తున్నారు. అవి బలిష్ఠంగా ఎదిగాక భారీ ఆర్జన చేకూరుతుందంటున్నారు.
దేశీయ ఆవులే మిన్న
మన ప్రాంత ఆవులకు పాలిచ్చే సామర్థ్యం రోజుకు లీటరు, రెండు లీటర్లకు మించదు. ఉత్తరాది గోవులు 15 నుంచి 20 లీటర్ల దాకా పాలిస్తుంటాయి. అలాంటి వాతావరణం మన దగ్గరా కల్పించాలన్నదే వెంకటేశ్ లక్ష్యం. గుజరాత్ వెళ్లి నెల రోజులు పరిశోధన చేసి మేలు జాతి రకానికి చెందిన గిర్ ఆవులను తెచ్చారు. ఒక్కోదానికి రూ.1,20,000 చొప్పున రెండింటిని కొనుగోలు చేశారు. ఇంకొంత కాలానికి మరో రెంటిని తీసుకొచ్చారు. తెచ్చే ముందు సదరు మూగజీవాల చరిత్రను పరిశీలించారు. ఉదాహరణకు 20 లీటర్ల పాలిచ్చే ఆవు ఉందనుకుందాం. దాని దూడలు అంతకన్నా ఎక్కువగా పాలివ్వాలంటే.. వీర్యం సేకరించే ఎద్దుకు సంబంధించిన తల్లిగోవు పాలిచ్చే సామర్థ్యం 25 లేదా 30 లీటర్లు ఉండాలి. ఈ ప్రకారం పుట్టబోయే దూడ ఎదిగి 25 నుంచి 30 లీటర్లు ఇచ్చే అవకాశముంటుంది. ఈ సిద్ధాంతం ఆధారంగానే బలిష్ఠమైన గిత్తలు(బుల్స్) తయారవుతుంటాయి.
అధిక ఆదాయం, గో సంతతి వృద్ధి లక్ష్యం
గిర్‌జాతి గిత్తల వీర్యంతో తయారైన ఇంజక్షన్లను వెంకటేశ్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి తన క్షేత్రంలోని ఆవుల కృత్రిమ గర్భధారణకు ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్ ధర రూ. 3,500. వీటిని తెచ్చే ముందు ఆ సూదిమందు తన ఆవులకు సరిపోతుందా, దాని తయారీకి ఉపయోగపడ్డ గోవు ముందు తరాల చరిత్ర ఏంటి అనే విషయాల్ని తెలుసుకుంటారు. ఎలాంటి రంగు, రూపు ఉండాలో గుర్తించి అలాంటి సూదిమందులే వాడుతూ నాలుగు ఆవుల సంఖ్యను కాస్తా పదింటికి పెంచారు. ప్రస్తుతానికి వెంకటేశ్ వద్ద నెల రోజుల దూడ ఉంది.
కాబ్రో రకానికి చెందిన దాని విలువ రూ.లక్షన్నర. ఏడాదికి 3 లక్షల అద్దె, మొత్తంగా రూ.10 లక్షల వరకు ఖర్చుచేసి ఆవులను పెంచుతున్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరితే ఆవుల ద్వారా భారీ ఆదాయం సమకూరవచ్చు. ఏడెనిమిదేళ్ల పాటు కష్టపడితే సంతతి వృద్ధి చెంది ఒక్కో ఆవు లక్షలు పలికే అవకాశముంది. నాలుగేళ్లుగా ఆదాయం లేకున్నా, పాలను రోజూ దూడలకే విడిచిపెడుతున్నా, రూ.లక్ష వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నా.. అయినా చింత లేదు..అంటున్నారు వెంకటేశ్. తన వద్ద ఉన్న జీవాలు ఏడాదికోసారి ఈతకు వస్తాయంటున్నారు. మున్ముందు ఇంజక్షన్లను గుజరాత్ నుంచి తేవటం కాకుండా తక్కువ ధరకు తానే తయారు చేయాలన్న తలంపుతో ఉన్నారాయన.
- ఇదీ చూడండి : నిరసన గళాన్ని కేంద్రం అణచివేస్తోంది: కాంగ్రెస్