యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో రేపటి నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్ విధించనున్నారు. కొవిడ్ వ్యాప్తిని దృష్ట్యా మే ఐదవ తేదీ నుంచి 15 వరకు మధ్యాహ్నం రెండు గంటల తరువాత దుకాణాలు మూసివేయాలని వ్యాపారస్తులు,స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంత కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
స్వచ్ఛంద లాక్డౌన్కు పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. వారం రోజులుగా మరణాలు సంభవిస్తున్నందున అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. రోడ్ల పైకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యవసరాలైన మెడికల్, పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు దుకాణాలకు బంద్ నుంచి మినహాయించినట్లు స్పష్టం చేశారు.