యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొలువై ఉన్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఏడాది పాటు తెలిసీ తెలియక చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా రెండో రోజు ఉదయం హావనం, మూలమంత్ర హోమం, లఘు పూర్ణాహుతి, స్వామి వారికి పవిత్రాల అలంకరణ మొదలగు కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు.
పురోహితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదపండితుల వేదపారాయణాల నడుమ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలను శాస్త్రోత్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కరోనా నిబంధనలకు లోబడి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలు రేపటితో ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి