యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని తంగడపల్లి పెద్ద చెరువు పూర్తి నిరాదరణకు గురవుతోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చెరువు.. ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో చెరువుపై ఆధారపడి 1,000కి పైగా ఎకరాల్లో రెండు పంటలు సాగయ్యేవి. చేపల పెంపకంపై ఆధారపడి 100కు పైగా కుటుంబాలు జీవనం సాగించేవి.
చుక్కనీరు లేదు..
ఏడేళ్ల కిందట నుంచి చెరువులోకి చుక్క నీరు కూడా వచ్చి చేరని దుస్థితి ఏర్పడింది. 2017లో మిషన్ కాకతీయ పథకం కింద తంగడపల్లి పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ. 1.40 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. అదే ఏడాది మార్చి 23న అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి చేతుల మీదుగా పునరుద్ధరణ పనుల కోసం కొబ్బరికాయ కొట్టారు. తర్వాత పనులు ముందుకు సాగలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు మొరపెట్టుకున్నప్పటికీ... చెరువును పునరుద్ధరించి సాగు నీరందించాలన్న స్పృహ లేకుండా పోయిందని రైతులు వాపోయారు.
ఇసుక మాఫియా..
ఎండిపోయిన పెద్ద చెరువుపై ఇసుక మాఫియా కన్నేసింది. చెరువులు, ఖాళీ స్థలాలు ఆక్రమించుకునే రాజకీయ నేతల అండదండలతో కొందరు దళారులు ఇసుక దందాకు తెరలేపారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలన్న ధోరణిలో అదే ప్రాంతానికి చెందిన ఓ వర్గం ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తోంది. అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్నా... నిరోధించే వ్యవస్థే కనపడటం లేదు.
గుహ తరహాలో..
ఇసుక రవాణాను.. పురపాలక శాఖ అధికారులు అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక గుంతలు ఒక్కోటి 15 నుంచి 20 అడుగుల లోతు ఉంటోంది. ఏకంగా లోపల చల్లగా విశ్రాంతి తీసుకునే గుహ తరహాలో ఉన్నాయి. చెరువు ఒడ్డు నుంచి లోపలికి వెళ్లే ట్రాక్టర్, ద్విచక్రవాహనాలు వెళ్లే దారి మాత్రమే ఉంటుంది. ఇసుకను తరలించే ముందు అక్రమార్కులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ తంతులో దాదాపు 100 కుటుంబాల సభ్యులు భాగస్వాములు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఏదో పార్టీ నేత వచ్చి నిందితులను పోలీసుస్టేషన్ నుంచి బయటకు తీసుకురావడం నిత్యకృత్యంగా మారగా.. చెరువు సంరక్షణపై ప్రజలు ఆశ వదిలేశారు.
ఇసుకాసురుల కబంధ హస్తాల్లో..
500 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువు... ఇసుకాసురుల కబంధహస్తాల్లో చిక్కుపోయి విలవిల్లాడుతోంది. క్రమేణా ఈ చెరువు కళావిహీనంగా మారిపోయింది. సరైన వర్షాలు లేకపోవడం, ఎగువ రాచకొండ అటవీ ప్రాంతం నుంచి నీరు రాకపోవడం వల్ల 2012 నుంచి తంగడపల్లి పెద్దచెరువు తూము తెరవలేదు. ఇసుక తవ్వకాల పుణ్యమాని అటువైపు వెళితే అక్రమమార్కులు ఎక్కడ ఎదురుదాడి చేస్తారో అనే భయం గ్రామస్థులను వేధిస్తోంది. తక్షణమే ఇసుకాసురుల నుంచి పెద్ద చెరువును కాపాడాలని రైతులు, మత్స్యకారులు, పశువులకాపరులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కన్నెత్తి చూడని పోలీసులు..
చెలరేగిపోతున్న ఇసుక మాఫియా... స్థానిక రాజకీయ అండదండలు, సరికొత్త దారులతో దళారులు, వ్యూహాలతో అందినంత మింగేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ఎక్కడపడితే అక్కడ పెద్ద గోతులు తవ్వి ఇసుక బయటకు తీస్తున్నతీరు భయానక పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ తతంగం సాగుతున్నా... రెవెన్యూ, పోలీసులు అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఇవీ చూడండి: ఐదేళ్ల బాలిక గొంతు కోసి చంపిన యువకుడు