యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాభివృద్ధిలో భాగంగా తుది మెరుగుల పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు యాడా అధికారులు శ్రమిస్తున్నారు. పుష్కరిణి ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ సమీపాన చదును చేస్తూ గోడ నిర్మిస్తున్నారు. గోడ వల్ల ఆలయం, బస్ వేకు వెళ్లే మార్గం సుగుమం కానుంది. ప్రధానాలయానికి సామాన్య భక్తులు కాలినడకన వెళ్లేందుకు నిర్మిస్తున్న మెట్లదారిని మెరుగుపరిచే క్రమంలో అండర్‌పాస్‌పై స్లాబ్ పనులు చేపట్టారు.
ఆలయ కైంకర్యాల నిర్వహణకు విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ వేగవంతం చేశారు. ఇక్కడ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు దృష్టిసారించారు. అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జరుగుతున్న ఫ్లోరింగ్ పనులు చివరిదశకు చేరాయి. శివుడి రథశాలను శైవాగమ ప్రకారం ప్రత్యేక హంగులతో ఏర్పాటు చేస్తున్నారు.
స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు...
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో 108 కలశాలకు శత ఘటాభిషేక పూజలు నిర్వహించారు. వివిధ ఫల రసాలు, పంచామృతాలతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. బంగారు పూర్ణ కలశంలోని జలాలను స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకించారు.
స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తులు సంగ వెంకటేశ్ - స్వరూప రాణి వారి కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకుని... 425 గ్రాముల వెండి కలశంను బహుకరణగా ఆలయ అధికారులకు అందజేశారు.
ఇదీ చదవండి: Yadadri temple news: వైభవంగా యాదాద్రిలో దేవీశరన్నవరాత్రులు..