Postal ballots avaliable in munugode bypoll: మునుగోడులో దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 739 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. వీరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి దశలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా బృందాలు వారి ఇళ్లకు వెళ్లి ఓట్లు నమోదు చేశాయన్నారు. నిన్నటివరకు 318 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారన్నారు.
ఈనెల 27, 28న మరో దఫా పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ పూర్తైందని... ఐదు శాతం మాక్ పోలింగ్ కూడా విజయవంతంగా జరిగిందని సీఈఓ పేర్కొన్నారు. అన్ని చెక్ పోస్టుల వద్ద వీడియో కెమెరాలు ఏర్పాటు చేశామన్న చెప్పారు. వీడియో కెమెరాలన్నీ నల్గొండ లైవ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై ఉన్నాయన్నారు. పార్టీలు, అభ్యర్థులు, ఏజెంట్ల తరపు వారు అక్కడ లైవ్ వీక్షించచ్చని సీఈఓ తెలిపారు.
ఎన్నికల నియమావళిపై పలు కేసులు నమోదు.. నియమావళి ఉల్లంఘనపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేశామన్న సీఈవో తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 2.70 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ 94 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఓటరు గుర్తింపు కార్డు లేని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆరు భద్రతా ప్రమాణాలతో ఇస్తున్న కొత్త ఓటరు గుర్తింపు కార్డులను మునుగోడులో అందించనున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. ఇప్పటి వరకు ఓటరు గుర్తింపు కార్డులు ఇవ్వని వారికి కొత్త ఎపిక్ కార్డులను ఉచితంగా స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఓటుహక్కు వినియోగించు కునేందుకు 11 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఈసీ అనుమతించింది. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధిహామీ జాబ్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, బ్యాంకు పాసుపుస్తకం, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆర్జీఐ - ఎన్పీఆర్ ఇచ్చే స్మార్ట్ కార్డు, ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఇచ్చే గుర్తింపు కార్డులు ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.
ఇవీ చదవండి: