యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం.. నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ప్రధాన ఆలయంలోని స్వయంభవులను మేల్కొల్పిన అర్చకులు బాలాలయంలోని కవచ మూర్తులను హారతితో కొలిచారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిజాభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి, శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ పర్వాలను చేపట్టారు. యాదాద్రి అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి స్వయంభువులను ఆరాధిస్తూ అభిషేకం, అర్చనలు, తిరు కల్యాణోత్సవం వేడుకలను సాంప్రదాయ రీతిలో జరిపారు.
తగ్గిన భక్తుల సందడి..
యాదాద్రి సన్నిధిలో ఆదివారమైనా.. భక్తుల సందడి అంతగా కనిపించలేదు. భక్తులు లేక ఆలయ మండపాలు, తిరువీధులు, ఘాట్ రోడ్డు ప్రధాన కూడళ్లు బోసిపోయాయి. ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో దర్శనం వరుసలు, ప్రసాదాల కౌంటర్లు, బుకింగ్ కౌంటర్లు వెలవెలబోయాయి.