కరోనా కష్టకాలంలో స్థానిక అవసరాలను అవకాశంగా మలుచుకుని రాణిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మాంసం ప్రియుల ఇష్టాలను తెలుసుకొని తమ వ్యవసాయ క్షేత్రాల్లో నాటు కోళ్ల పెంపకాన్ని చేపడుతూ... ముందుకు సాగుతున్నారు. నాటు కోళ్లు, గుడ్ల విక్రయంతో ముందుకెళ్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేశ్.
యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట గ్రామానికి చెందిన రంగ నరేశ్.. తనకున్న 12 ఎకరాల్లో వరి కూరగాయలు, పాడిపరిశ్రమతో పాటు నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ఐదు కోడి పెట్టలకు ఒక పుంజు చొప్పున సుమారు 800 వందల కోడి పిల్లలను కొనుగోలు చేశారు. సహజసిద్ధ పద్ధతిలో వాటిని పెంచేందుకు వీలుగా తన వ్యవసాయ భూమిలో వదిలేశారు. అక్కడ లభించే క్రిమి కీటకాలతో పాటు, వడ్లు, నూకలు దాణాాగా వేశారు. అవి రోజుకు 80 నుంచి 100 గుడ్ల వరకు పెడుతున్నాయి.
లాభదాయకమే...
నాటుకోడి గుడ్లకు మంచి డిమాండ్ ఉండటం వల్ల వాటిని స్థానికంగానే విక్రయిస్తున్నారు. అందులో కొన్నింటిని పొదిగించి.. మళ్లీ కోడి పిల్లల ఉత్పత్తి చేపడుతున్నారు. రెండు సంవత్సరాలుగా చేపడుతున్న ఈ పెంపకం మంచి లాభదాయకంగా ఉందని.. తెలిపారు. నాటుకోళ్లు, గుడ్లు విక్రయంతో మంచి ఆదాయ వస్తోందని చెప్పారు.
ఇంక్యుబేటర్ ద్వారా కూడా ఏకకాలంలో వెయ్యి పిల్లలను పొదిగించే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. మండలంలోని చుట్టుముట్టు గ్రామాల రైతులకు ఆర్డర్ ప్రకారం ఇంక్యూబేటర్ ద్వారా కూడా అందించడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం కోళ్ల పెంపకం చేపట్టే వారిని ప్రోత్సహించాలని కోరారు.
- ఇదీ చదవండి: 'తొందరపడి అమ్ముకోవద్దు... మొత్తం మేమే కొంటాం'