తన నియోజక వర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థానిక ఎంపీగా తనను ఎందుకు ఆహ్వానించలేదని అధికారులను ప్రశ్నించారు. సంస్కారం, మర్యాద లేని వ్యక్తి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ఆరోపించారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగులద్ది... తెరాస ప్రజా ప్రతినిధులను మాత్రమే పిలిచి పార్టీ కార్యక్రమంగా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజా ప్రతినిధులను పిలవాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌కు నివాళులు అర్పించని వారు... రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారని విమర్శించారు.
కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్‌కు రోడ్డును అడ్డుకున్నందుకే వాసాలమర్రి ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫాంహౌజ్‌కు రోడ్డు కోసం వాసాల మర్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు నిధులతో చేపట్టే కార్యక్రమాలకు తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Cm Kcr: ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి కావాలి..