ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపల్ సాధారణ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలతో, కార్యకర్తలతో ముచ్చటించారు. అనవరమైన వివాదాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. పీసీసీ పదవిపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.
ఎంపీ స్థాయిలో ఉన్న తాను చిల్లర రాజకీయాల గురించి మాట్లాడనని ఎంపీ కోమటి రెడ్డి అన్నారు. తాను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని.. వారిని సముదాయించేందుకే మాట్లాడానని వివరించారు. భువనగిరి నియోజకవర్గ కేంద్రాన్ని 500 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో చర్చించా..
సికింద్రాబాద్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీస్ రైలు సర్వీసులను పొడిగించే విషయమై ప్రధానితో మాట్లాడానని ఎంపీ కోమటి రెడ్డి తెలిపారు. అందుకోసం 470 కోట్లు ఖర్చవుతాయని మోదీ చెప్పారని పేర్కొన్నారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 75 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఈ విషయమై సీఎస్ సోమేశ్ కుమార్తో కూడా చర్చించానని అన్నారు.
" నేను ఎంపీని చిల్లర రాజకీయాల గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేను. ఇకపై రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారెవరైనా నన్ను ఆశ్రయిస్తే వారికి తగిన సహాయం చేస్తాను. యాదిగిరి గుట్టకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్న క్రమంలో బస్సుల్లో నిలబడడానికి కూడా ఖాళీ లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. వారి అవస్థలను తొలగించడానికి ఎంఎంటీఎస్ రైలు సేవలను రాయగిరి వరకు పొడగించాలని ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేశాను. ఈ విషయమై ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 75 కోట్లు అవసరమవుతాయి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్తో మాట్లాడాను." - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ.
ఇదీ చదవండి: PADDY: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ఆల్ టైం రికార్డ్