అనాథగా దిక్కుతోచని స్థితిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామానికి చెందిన తోటకూరి ముత్తమ్మ (68) అనే వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీచోటు. ఎవరూ లేని ఆమెను చేరదీసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఒంటరై..
ముత్తమ్మకు చిన్న వయస్సులోనే పెళ్లి జరిగింది. భర్త బాలయ్య మధ్యలోనే వదిలేసి వేరే వివాహం చేసుకున్నాడు. నా అనే వాళ్లు ఎవరూ లేక ఒంటరై బతుకు దెరువు కోసం సొంత ఊరు విడిచి భువనగిరికి 20 ఏళ్ల క్రితం వచ్చింది.
భువనగిరిలోని ఎలిమినేటి మాధవరెడ్డి పెంకుల పరిశ్రమలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కరోనా ప్రభావంతో ఆ కంపెనీ మూసివేయడంతో వృద్ధురాలికి ఇబ్బందిగా మారింది. వయసు మీద పడి చేతగాక కనీసం తన పని తాను చేసుకోలేని పరిస్థితిలో ఉంది.
స్థానికులు పెడితేనే..
స్థానికులు పెట్టే అన్నం తిని కాలం గడుపుతూ వస్తోంది. ఆమె పరిస్థితి చూసి చుట్టుపక్కల వారు జిల్లాలోని రాయగిరి సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకూబీచోటుకి సమాచారం ఇచ్చారు. తన సిబ్బందితో వృద్ధురాలిని అనాథ వృద్ధ ఆశ్రమానికి ఈ రోజు తరలించారు.
కార్యక్రమంలో సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ ఆశ్రమ కోఆర్డినేటర్ నజీర్ మియా, స్థానికులు బాలయ్య, సంతోష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దారుణహత్య... తల, మెుండెం వేరు చేసిన దుండగులు