యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని బాలకృష్ణారెడ్డి కోరారు. శాసన మండలిలో ప్రజల గొంతు వినిపించాలంటే రాణి రుద్రమ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పట్టభద్రుల ఓట్లను డబ్బులతో కొనాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాణి రుద్రమ ఆరోపించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా.. ప్రజల కోసం పనిచేసే తనను ఆశీర్వదించాలని కోరారు. పట్టభద్రులు ఎక్కువ శాతం మంది ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల అర్హతలేని వ్యక్తులు పదవులు పొంది, రాజభోగాలు అనుభవిస్తూ.. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న రుద్రమ, పట్టభద్రులంతా తనకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఆదివాసీల ఉసురుతీస్తుంది ఎవరు?... ఏజెన్సీలో గోడపత్రికల కలకలం...