యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేనిగూడెం గ్రామంలో తల్లితండ్రులు కోల్పోయి అనాథలైన ముగ్గురు ఆడపిల్లలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అండగా నిలిచారు. శుక్రవారం పిల్లలకు తక్షణ సహాయం కింద 25,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.
కదిరేనిగూడెం గ్రామానికి చెందిన నల్లమాస అశోక్ గౌడ్ తాటి చెట్టుపై నుంచి కింద పడినప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఎల్వోసీ కింద 2 లక్షలు మంజూరు చేశామని.. అయినా ఆయన ప్రాణాలు దక్కకపోవడం చాలా బాధాకరమని సునీత అన్నారు. వారి పిల్లల్లో పెద్ద కూతురిని దత్తత తీసుకొని రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి పూర్తి బాధ్యతలు తానే చూస్తానని హామీ ఇచ్చారు.
కుటుంబ సభ్యులు అంగీకరిస్తే మిగితా ఇద్దరు పిల్లలను కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్ బాధ్యతలు కూడా చూస్తానని తెలిపారు. మృతుడికి తెరాస సభ్యత్వం ఉన్నందున పార్టీ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తామన్నారు. వీరి సమస్యను సోషల్ మీడియాలో చూసిన కేటీఆర్ స్పందించి స్వయంగా గ్రామ సర్పంచ్ వేముల పాండుకి ఫోన్ చేసి వివరాలు ఆడిగి తెలుసుకున్నారని తెలిపారు.
వారి టీం, వివరాలు సేకరించే పనిలో ఉన్నారని చెప్పారు. అది పూర్తవ్వగానే కేటీఆర్ నుంచి కూడా సహాయం అందేటట్లు చూస్తామని అన్నారు. అదే గ్రామానికి చెందిన జెట్ట మహేశ్వర్ బాధిత కుటుంబానికి 20,000 వేల రూపాయల చెక్కు, నిత్యావసర సరుకులు అందజేశారు. సీడీపీవో డిపార్ట్మెంట్ వారి అధ్వర్యంలో ఇద్దరు పిల్లలకు నెలకు 2 వేలు సహాయం అందజేయనున్నారు. ఈ మేరకు సీడీపీవో చంద్రకళ మంజూరు పత్రాన్ని పిల్లలకు ఇచ్చారు.
ఇదీ చదవండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల