Minister jagadish reddy: తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మహిళా బంధు వేడుకలను చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు.
అనంతరం మంత్రి అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న బోధన సిబ్బందికి మహిళా దినోత్సవ సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా 800మందికి సన్మానం చేసి చీరలు పంపిణీ చేశారు. 105 కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
'మొదటగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పేదింటి ఆడ బిడ్డల వివాహాల కోసం సీఎం కేసీఆర్ ఆలోచనలతో వచ్చిన పథకం కల్యాణ లక్ష్మి పథకం. రాష్ట్రం ఏర్పడక ముందు మహిళలకు పోకిరీలతో సమస్యలు వుండేవి. రాష్ట్రం వచ్చాక మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి 'షీ టీమ్స్' అనే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనితో ఆకతాయిల సమస్య లేకుండా పోయింది. చదువు అందరికీ ముఖ్యమని 400లకు పైగా మహిళల కోసం కస్తూర్భా, ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేసీఆర్ ఏ కొత్త పథకం తీసుకొచ్చిన మహిళల పేర్ల మీదనే రూపొందిస్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని సర్కార్ అందిస్తుంది.'
-జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:mahila manavaharam: 'థ్యాంక్యూ కేసీఆర్ సర్'.. ఆకట్టుకున్న మహిళల మానవహారం..