Yadadri: అద్భుత శిల్పకళానైపుణ్యం, స్వర్ణమయ వెలుగుల మధ్య యాదాద్రి ఆలయం భక్తులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 28న యాదాద్రి ఆలయ మహాసంప్రోక్షణను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు అనుమతి ఇస్తామన్న మంత్రి.. ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర,11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలుంటాయని మంత్రి వెల్లడించారు. అనంతరం నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారని తెలిపారు.
మహాపూర్ణాహుతితో మొదలై..
ఉదయం 9 గంటల నుంచి మహాపూర్ణాహుతితో మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమాలు ముగుస్తాయి. కావున 4గంటల నుంచి సందర్శకులు, భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, అందరిని కూడా సతీసమేతంగా రావాలని ఆహ్వానించారు. ఆహ్వానించిన అతిథులందరూ సకాలంలో వచ్చి జయప్రదం చేయాలి. -ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
పూర్ణాహుతి ముగిసిన అనంతరం.. బాలాలయం నుంచి స్వామి వారిని ప్రధానాలయంలోకి తీసుకువస్తామని.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. వెయ్యేళ్లపాటు వెలుగొందే.. యాదాద్రి మహా పుణ్యక్షేత్రాన్ని ఈ నెల 28న ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. భక్తులు దర్శించుకోవాలని ఆలయ ఈవో గీత సూచించారు.
ఈ దేవాలయ నిర్మాణంలో అంకితభావంతో పనిచేసిన వారందరిని సీఎం కేసీఆర్ సన్మానించదలచుకున్నారు. దేవాలయం ప్రాంగణంలోనే వారికి సన్మానం పూర్తయిన తర్వాత భోజన విరామం అనంతరం భక్తులు యాదగిరిగుట్ట పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -గొంగిడి సునీత, ప్రభుత్వ విప్
మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అవసరమైన పూజ కైంకర్యాలు ముగిసిన తర్వాత, అర్చకుల వేద ఆశీర్వచనం కొనసాగిన అనంతరం సామాన్య భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశాం. సకుటుంబంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. -గీతారెడ్డి, యాదాద్రి ఆలయ ఈవో
ఇదీ చదవండి: