తల్లితండ్రులు లేక అనాథలైన పిల్లలు అనే వార్తను చూసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చలించిపోయారు. వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామ సర్పంచ్, నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి జరిగిన దాని గురించి తెలుసుకున్నారు. ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్రాజును మంత్రి కోరారు. అడిగిన తక్షణమే ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్‌రాజు తెలిపారు. దీనికి మంత్రి ఎర్రబెల్లి.. ఆయనను అభినందించారు.
ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య కుటుంబం ఆనందంగా జీవిస్తుండేది. కానీ అనారోగ్యం వల్ల గత సంవత్సరం సత్తయ్య చనిపోవడం.. భార్య అనురాధ, పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్‌లతో కూలీ చేసుకుని బతుకీడుస్తోంది. కాగా భర్త చనిపోయిన బాధలో ఆమె కూడా మంచం పట్టి రెండురోజుల క్రితం మృతి చెందింది.
ఊరిలోని గ్రామస్థులు, పెద్ద మనుషులు చందాలు వేసుకుని అనురాధ అంత్యక్రియలు నిర్వహించారు. దీనితో సంవత్సరం క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి చనిపోవడం వల్ల ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఊరి గ్రామస్థులు అందరూ కలిసి వారిని సంరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేయగా.. మంత్రి స్పందించి.. దిల్రాజును సంప్రదించారు.
ఇదీ చదవండి: 'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా'