నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి క్షేత్రం లాక్‌డౌన్ కారణంగా కళ తప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. ఫలితంగా ఆలయ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది.
సాధారణ రోజుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే టెంపుల్ ఘాట్ రోడ్డు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తోంది. భక్తులతో నిత్యం సందడిగా ఉండే దర్శన క్యూలైన్లు, లడ్డూ ప్రసాద లైన్లు వెలవెలబోతున్నాయి. శివాలయం, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు బోసిపోయాయి. మరోవైపు భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ.. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే నిత్యకైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగుతున్నాయి.