రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, మోటకొండూర్ మండలాల్లోని వంగపల్లి, అమ్మనబోలు, ఆలేరుల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పంటను అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన పనిలేదని మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మద్దతు ధర అందిస్తూ.. చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్, ఆలేరు పుర ఛైర్మన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, స్థానిక తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.