కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్.. యాదాద్రి దేవస్థానం ఆదాయ వనరులపై తీవ్రప్రభావం చూపుతోంది. దీంతో ఆలయ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కష్టంగా మారింది. ఆలయానికి వచ్చే ఆదాయంలో సగ భాగం ప్రసాదాల విక్రయాల వల్ల వస్తుంది. లాక్‌డౌన్ కారణంతో భక్తులకు దైవదర్శననాలు నిలిపివేశారు.
భక్తులు లేకపోవడంతో ప్రసాదాల తయారీ, విక్రయశాలను మూసివేయడంతో రాబడికి ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా సిబ్బంది వేతనాలకు సుమారు రూ. 1.85 కోట్లు అవసరమని తెలిపారు. గతేడాది కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో జూన్లో ఆలయ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ. 2 కోట్లు తీసి వేతనాలు ఇచ్చారు. ఈసారి ఆదాయానికి కోత పడటంతో జీతాలు ఇవ్వడం దేవస్థానానికి తలకు మించిన భారంగా మారింది. మరోసారి లాక్‌డౌన్ పెంచితే ప్రభుత్వానికి వేతనాల విషయంపై నివేదిక పంపాల్సి వస్తుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Yadadri Temple : గండిచెరువు వద్ద కట్టడాల నిర్మాణం వేగవంతం