యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్న వేళ... అక్కడ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. చుట్టుపక్కల మండలాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇదే సమయంలో అక్రమాలూ వెలుగుచూస్తున్నాయి. జులై 29న యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ(ACB) అధికారులు దాడులు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను అరెస్ట్ చేశారు.
డబ్బులు డిమాండ్
యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, రాజపేట, మోటకొండూరు మండలాల్లోని గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్లు(REGISTRATIONS) ఈ కార్యాలయంలోనే జరుగుతాయి. భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరగడం వల్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అంతేకాకుండా అనుమతిలేని అక్రమ వెంచర్లలో ప్లాట్లు విక్రయించే అక్రమార్కులతో చేతులు కలిపి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని వాపోయారు.
సబ్‌రిజిస్ట్రార్ అరెస్ట్
ఓ వెంచర్‌లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా బాధితుడి ఫిర్యాదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌కు సంబంధించిన మేడిపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించి... రూ.76,09,500 నగదు, 27.03 గ్రాముల బంగారు ఆభరణాలు,7.09 ఎకరాల భూమికి సంబందించిన దస్తావేజులు, 200 గజాల ప్లాటు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్ల ఏసీబీ అధికారులను ఆశ్రయించాం. రెండేళ్ల క్రితం యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగి అధికారులను బదిలీ చేశారు. ఓ మహిళ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. అయినా అధికారుల్లో మార్పు రాలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పటిష్ఠంగా పర్యవేక్షించాలని కోరుతున్నాం.
-సత్యం మాడే, ఫిర్యాదుదారుడు
గతంలోనే ఏసీబీ సోదాలు
యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో కటిక కృష్ణ అనే వ్యక్తి తన ప్లాటును 2020 ఫిబ్రవరిలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని... ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. రికార్డులు సీజ్ చేసి అధికారులను బదిలీ చేశారు. గతంలో ఇదే కార్యాలయంలో ఈసీలు, వివాహ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి డబ్బులు అధికంగా వసూలు చేస్తుండటంతో ఓ మహిళ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు.
యాదగిరిగుట్లలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో సోదాలు జరిగాయి. కొంతమంది అధికారులను బదిలీ చేశారు. అయినా ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతో అక్రమంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది అందరూ డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం పరిధిలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనివల్ల సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
-స్థానికులు
ఇదీ చదవండి: ROAD ACCIDENT: కాబోయే భర్త కళ్లెదుటే యువతి కన్నుమూత