Bee attack on Minister: యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తేనెటీగల దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగల దాడి జరిగింది. దీంతో మంత్రితో పాటు పలువురు వేదపండితులు, సిబ్బంది గాయపడ్డారు.
ఉదయం 11:45 గంటల సమయంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమైన మంత్రి పైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకొని హుటాహుటిన మంత్రి అజయ్ హైదరాబాద్‌కు బయల్దేరివెళ్లారు. ప్రస్తుతం ఆయన చికిత్స చేయించుకుంటున్నారని పలువురు వెల్లడించారు.
మంత్రి పువ్వాడ క్షేమం..
విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి ఏమి కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా మళ్లీ తిరిగి రావాలని పలు ఆలయాల్లో పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా దాడిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తాను క్షేమంగా ఉన్నానని మంత్రి పువ్వాడ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని వివరించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నెమ్మదించారు. త్వరగా తమ మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: