యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ఉన్న స్వయంభు హనుమాన్ ఆలయాన్ని తొలగించవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండ చుట్టూ వలయ రహదారి పనులు చేపడుతుండగా... ఈ భూసేకరణలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన స్వయంభు అంజన్న స్వామి ఆలయాన్ని తొలగించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయాన్ని కూల్చవద్దంటూ తెలంగాణ వానరసేన అధ్యక్షులు నామ్ రామ్ రెడ్డి జులై 2న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాన్ని కూల్చవద్దు అంటూ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.
కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వానర సేన నాయకులు శుక్రవారం దర్శించుకున్నారు. హైకోర్టు తీర్పు అనంతంరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పుజలు జరిపారు. యాదాద్రి కొండపైన గల శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ విజయోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ కాంతేంధ్ర స్వామీజీ, వానరసేన అధ్యక్షుడు నామ్ రామ్ రెడ్డి, రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షురాలు బండ్రు శోభా రాణి, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి, భాజపా నాయకులు శ్యామ్ సుందర్, ఆనంద్, ప్రవీణ్, వానరసేన కార్యదర్శులు, నరసింహ స్వామి భజన మండలి సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై దీపావళి శుభాకాంక్షలు