ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం ఈదుల వాగు పొంగిపొర్లుతోంది. పంతంగి పరిధిలోని పిలాయిపల్లి కాలువ నుంచి చెరువులోకి తీసిన కాలువకు గండి పడింది. ఆ వరద నీరంతా.. కలవడం వల్ల ఈదులవాగు ఉధ్ధృతంగా ప్రవహించి వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని.. వాగు మీదుగా కల్వర్టు నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద కొండూరు, చిన్నకొండూర్, మందోళ్లగూడెం, నేలపట్ల మీదుగా ఈదులవాగు 150 మీటర్ల మేరకు విస్తరించి ప్రవహిస్తోంది. వాగు ప్రవాహంతో రైతుల పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి రోడ్డు కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా వాగు ఇలాగే ప్రవహిస్తోందని.. గత 50 ఏళ్లుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందోళ్లగూడెం నుంచి నార్కట్‌పల్లి వెళ్లే రోడ్డులో ఉన్న ఈదుల వాగు వద్ద కల్వర్టు నిర్మించాలని అనేక సార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదని.. సీపీఎం మండల కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల సమయంలో హడావిడిగా పెద్ద పైపులు తెచ్చి నిర్మాణం ప్రారంభిస్తున్నట్టు చెప్పినా.. ఇప్పటికీ ఆ పైపులు అక్కడే ఉన్నాయి. విద్యావంతుల ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వస్తే.. ఈదుల వాగు పారి.. పంటచేలన్నీ నీటిలో మునిగిపోతున్నాయని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:తొలిరోజు సెషన్లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడివేడి చర్చ