Harish Rao Visited Bibinagar Aims: బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు, భవనాలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్‌ను సందర్శించి వెళ్లారే తప్పా... ఆసుపత్రిలోని వసతుల కొరతపై కేంద్రానికి విన్నవించడం లేదని ఎద్దేవా చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడ క్లినికల్ ప్రాక్టీస్ చేయలేక... యాదాద్రి జిల్లా ఆసుపత్రికి వెళ్తాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎయిమ్స్ పరిస్థితులను కేంద్రానికి తెలియజేస్తామని హరీశ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీబీనగర్ ఆసుపత్రిలోని వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఇప్పటి వరకు ఒక్క ఆపరేషన్ జరగలేదు. భాజపా వాళ్లకు సిగ్గులేదు.. బాధ్యత లేదు. ఇప్పటివరకు ఎయిమ్స్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క ఎయిమ్స్ మాత్రమే దాన్ని కూడా గాలికి వదిలేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు. భాజపా వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎయిమ్స్‌ను చూస్తేనే తెలుస్తుంది వారి పనితీరు. ఎయిమ్స్‌లో చదువుతున్న 212 మంది వైద్య విద్యార్థులు ఎక్కడికి పోవాలి? వాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. ఎందుకు ఇంత అలసత్వం? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? భాజపా సమాధానం చెప్పాలి. భువనగిరిలో 3 బస్తీ దవాఖానాలను మంజూరు చేస్తున్నాం. భువనగిరి కేంద్ర ఆసుపత్రిని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. -- హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి